చంపడం, సజీవ దహనం, ఇజ్రాయల్ హమాస్ యుద్దం, మొఘల్ సామ్రాజ్యవాదం లాంటి పదాలు ఇప్పుడు ఛత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారంలో ఎక్కువవగా వినిపిస్తున్న మాట వాస్తవం.పార్టీల తీరు కూడా అలాగే ఉందన్నది నిస్సందేహమైన అంశం . బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటా పోటీగా ఉండటంతో పార్టీల ప్రచారం కూడా రసవత్తరంగా సాగుతోంది.
మత విభజనతో మారిన సీన్
బీజేపీపై బురద జల్లేందుకు కాంగ్రెస్ పార్టీ మత విభజనకు దిగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. చత్తీస్ గఢ్ ఎన్నికల చరిత్రలో మత పరంగా ఒక పార్టీ ఓట్లు అడగడం కూడా ఇదే మొదటిసారి కావచ్చు. హిందూ – ముస్లిం ఘర్షణల పేరుతో ఓ యువకుడిని కొందరు దుండగులు కొట్టి చంపితే.. వారిని కాంగ్రెస్ పార్టీ వెనుకేసుకొస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. హతుడైన యువకుడి కుటుంబానికి న్యాయం చేసే దిశగా అతని తండ్రికి బీజేపీ టికెట్ ఇస్తే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ కమలంపై బురద చల్లుతోంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఛత్తీస్ గఢ్ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడి మంత్రి అక్బర్ ను విమరిస్తే రాష్ట్రాన్ని పాలస్థీనాతోనూ, కాంగ్రెస్ పార్టీని హమస్ తోనూ పోల్చుతున్నారని ఎదురుదాడి చేశారు. హమస్ నేత పేరు కూడా అక్బర్ కావడమే ఇందుకు కారణం కావచ్చు. రాష్ట్రంలో ముస్లిం జనాభా చాలా తక్కువైనప్పటికీ ఓట్ల పోలరైజేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు దొక్కుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ వైపే ఓబీసీలు…
రాష్ట్రంలోని ఓబీసీ వర్గానికి చెందిన సాహు సామాజికవర్గం ఓటర్లు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. సాహు కులానికి బీజేపీ 9 సీట్లు ఇస్తే, కాంగ్రెస్ 7 సీట్లు ఇచ్చింది. కాకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి భుపేష్ భాగెల్ ప్రభుత్వంలో తమరధ్వాజ్ సాహుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఎన్నికల ప్రచారాస్త్రమైంది. ఛత్తీస్ గఢ్ లో అగ్రకులాల ఓట్లు ఎనిమిది శాతమే అయినందున ఓబీసీ ఓటర్లు చాలా కీలకమవుతారు.
కాంగ్రెస్ హామీల్లో డొల్లతనం
అన్ని రాష్ట్రాల్లాగే ఛత్తీస్ గఢ్ లో కూడా ఉచితాలతో నెగ్గుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారానికి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని, కుల గణన చేపడతామని, ప్రతీ రైతు నుంచి ఎకరాకు 20 క్వింటాళ్ల బియ్యం కొంటామని, 17.5 లక్షల ఇళ్లు నిర్మించి నిరుపేదలకు ఇస్తామని సీఎం భాగెల్ తాజాగా ప్రకటించారు. అయితే ఈ హామీలపై కాంగ్రెస్ పార్టీలోనే పెదవి విరుపు కనిపిస్తోంది. ఇప్పటికే ధాన్యానికి బోనస్ ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థ అథోగతిపాలైందని, ఇంకా డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలని వాళ్లు ప్రశ్నించుకున్నారు. ఇలాంటి హామీలతో గెలిచిన తర్వాత ఇబ్బంది పడతామని వాపోతున్నారు. ఖజానా ఖాళీగా ఉన్నందున రుణమాఫీ సాధ్యంకాదని బీజేపీ బహిరంగంగానే వాదిస్తోంది. కాంగ్రెస్ కు అంత దమ్ము ఉంటే 22 మంది సిట్టింగులకు మొండి చేయి ఎందుకు చూపించిందని బీజేపీ ప్రశ్నిస్తోంది.. దీనికి భాగెల్ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు..