అప్పట్లో వయసు పైబడిన తర్వాత బీపీ, షుగర్ వచ్చేవి..కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఇవి అటాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆహారంలో మార్పులే కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలని సూచిస్తున్నారు.
కొంతమందికి తిన్న తర్వాత బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి? ఇంకొందరికి తిన్నాక కూడా నీరసంగా అనిపిస్తుంది?..ఇవన్నీ మీకు మధుమేహం వచ్చే ప్రమాదం ఉందనడానికి సంకేతం కావచ్చు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఈ దీర్ఘకాలిన వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు.
అల్పాహారం స్కిప్ చేయవద్దు
బరువు తగ్గాలనే ఆలోచనతో చాలామంది ఉదయం పూట టిఫిన్ మానేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు. నిజానికి అల్పాహారం దాటవేయడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతుందట.
కొంచెం కొంచెం తినండి
ఒక్కసారి కడుపునిండా తినేయకుండా కొంచెం కొంచెం చొప్పున తినడం ఆరోగ్యానికి చాలామంచిది. మీరు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే, మీ రక్తంలో చక్కెర సమతుల్యంగా ఉంటుంది. ఆకస్మిక హెచ్చుతగ్గులు ఉండవు. అలాగని పదే పదే తినడం కూడా సరికాదు.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి
ఫైబర్ ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరంలో త్వరగా కరగదు. అందుకే దీని వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు. ఎందుకంటే ఇది చాలా తక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తుంది. పైగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు తినండి
తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తాయి. పిజ్జా, బ్రెడ్ లేదా అన్నం వంటి అధిక-గ్లైసెమిక్ ఆహారాల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలి.
తిన్న వెంటనే నిద్రపోవద్దు
చాలా మంది తిన్న వెంటనే బద్ధకంగా వాలిపోతారు. అయితే తిన్న వెంటనే పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ త్వరగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తిన్నాక కాసేపు అటు ఇటు నాలుగు అడుగులు వేయడం మంచిది.
ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే తేలిక పాటి వ్యాయామం చేయాలి. ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయించుకోవడం చాలా ముఖ్యం.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.