ముదిరాజుల దెబ్బకు బీఆర్ఎస్ ముగ్గురు అగ్రనేతలకు ఓటమేనా ?

రాజకీయాల్లో చేసే కొన్ని వ్యూహాత్మక తప్పిదాలే పార్టీలకు గుదిబండవుతాయి. సీటు కిందకు నీళ్లు తీసుకు వస్తాయి. ఈ సారి ఇలాంటి స్ట్రాటజిక్ మిస్టేక్‌లు బీఆర్ఎస్ వైపు నుంచి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ముదిరాజ్ వర్గానికి ఒక్క టిక్కెట్ కూడా కేటాయించకపోవడం. ఆ వర్గం మొత్తం ఏకం అయింది. దీంతో ముదిరాజ్‌లను సంతృప్తి పరిచేందుకు బీఆర్ఎస్ ఆ వర్గానికి చెందిన ప్రముఖులకు తిరస్కరించలేని ఆఫర్లు ఇస్తూ పార్టీలోకి తీసుకుంటోంది. ఇది ముదిరాజుల్ని మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

ఈటల రాజేందర్ చేరిక తర్వాత బీజేపీకి మద్దతు పలుకుతున్న ముదిరాజులు

తెలంగాణ బీసీ వర్గాల్లో ముదిరాజుల వర్గం ప్రభావవంతమనది. ఈ వర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ ఆయన బయటకు వచ్చే వరకూ కీలకంగా ఉన్నారు. ఆలె నరేంద్ర, విజయశాంతి సహా అనేక మంది రెండో స్థానంలో ఉన్న నేతలు అవమానకరంగా బీఆర్ఎస్ నుంచి గెంటివేతకు గురైన పరిస్థితులే.. ఈటల రాజేందర్‌కూ ఎదురయ్యాయి. అప్పట్నుంచి ముదిరాజులు బీఆర్ఎస్‌పై ఆగ్రహంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క టిక్కెట్ కూడా కేటాయించకపోవడంతో అది రెట్టింపు అయింది. నీలం మధు ముదిరాజ్ అనే నేతను ఆశపెట్టి చివరికి హ్యాండివ్వడం వారి ఆగ్రహం పెరగడానికి కారణం అయింది. మొదటి జాబితాలోనే బీజేపీ ముదిరాజులకు మూడు సీట్లు కేటాయించడంతో వీరంతా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు గండం !

బీఆర్ఎస్‌లో ముదిరాజుల టెన్షన్ పెరగడానికి మరో కారణం ఉంది. ముదిరాజ్‌ సామాజిక వర్గం ఓట్లు గజ్వేల్‌లో 60 వేలు, సిద్ధిపేటలో 45 వేలు, సిరిసిల్లలో 40 వేలు, కామారెడ్డిలో 30 వేల దాకా ఉన్నాయి. ఇవి ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. ముదిరాజ్‌ల ఓట్లతోపాటు గజ్వేల్‌లో బీజేపీ నుంచి పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్‌ రూపంలో సవాల్ ఎదురవుతోంది. 2014 నుంచి గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్ధిపేటలో వారు ముగ్గురూ బంపర్‌ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ముదిరాజ్‌ సామాజిక వర్గం వల్ల అసలుకే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

పూర్తిగా ముదిరాజులు దూరమైతే బీఆర్ఎస్ పతనం ఖాయం !

ఒక్కరికి కూడా అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకపోవడం ఇంత మైనస్ అవుతుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోయాయి. గతంలోనే ఈ వర్గం పార్టీకి దూరమైందని… కానీ సగానికిపైగా బీఆర్ఎస్‌కే అండగా ఉంటారని భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ వర్గం చూపించే ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాలు రావడంతో… ప్రాధాన్యత కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ఓ సారి అవమానించారని తెలిసిన తర్వాత ఆ వర్గం మళ్లీ దగ్గరవ్వాలంటే.. ఎన్నికలకు ముందు ఎన్ని చేసినా సాధ్యం కాదు. అందుకే .. బీఆర్ఎస్ పరిస్థితి ప్రమాదంలో పడిపోయిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.