ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీని మోసం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయనే కాంగ్రెస్ అభ్యర్థి. కానీ బీజేపీ ఆయనను ఓడించడానికి పక్కా ప్రణాళిక రెడీ చేసింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న బూర నర్సయ్య పోటీ చేస్తే త్రిముఖ పోటీగా మారుతుంది.
మునుగోడులో 66 శాతం బీసీ ఓటర్లు
రాష్ట్ర బీజేపీ నాయకత్వం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. మునుగోడు నియోజకవర్గం నుంచి గతంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి రెండు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సారి బీసీ అభ్యర్థికి చాన్సివ్వాలని ప్రాథమికంగా నిర్మయించారు. ఉపఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ను మునుగోడు నుంచి ఈ సారి బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 66 శాతానికి పైగా బీసీ ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రధానంగా బూర నర్సయ్య గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 17 శాతం మంది ఉన్నారు. దీంతో ఈ సారి మునుగోడు నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలన్న యోచనలో ఉందంటున్నారు.
బలమైన బీసీ నేత బూర నర్సయ్య గౌడ్
తెలంగాణ ఉద్యమంలో డాక్టర్స్ జేఏసీ నాయకుడిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ముందు నుంచీ పనిచేశారు. ఆ ఉద్యమంలో ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి నడిచారు. ఈ కారణంగానే 2014 లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి లోక్ సభా నియోజకవర్గం నుంచి ఆయనను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటికి నిలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు. కానీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రెండో సారి పోటీ చేసినా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జిల్లా రాజకీయాల్లో ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోయింది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పొసగలేదు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బరిలోకి దిగే ఆలోచనలు కూడా చేశారు. కానీ, ఇంతలోనే మునుగోడుకు ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్ కు టికెట్ కూడా వస్తుందని ప్రచారం జరిగినా, బీఆర్ఎస్ నాయత్వం మాజీ ఎమ్మెల్యే, 2018 ఎన్నికల నాటి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. కేసీఆర్ మోసం చేశారని తెలియడంతో ఆయన బయటకు వచ్చేశారు.
కోమటిరెడ్డికి షాక్ తప్పదా ?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్లిపోవడంతో.. మునుగోడులో ఈ సారి బీజేపీకి సరైన అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్న నిశ్చిత అభిప్రాయానికి బీజేపీ హైకమాండ్ వచ్చినట్లు చెబుతున్నారు. . ఇదే జరిగితే ఆర్థికంగా కూడా బలవంతుడైన బూర నర్సయ్య గౌడ్ రాజగోపాల్ రెడ్డికి షాకివ్వడం ఖాయమని అంచనా వేస్తున్నారు.