జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం

అయోధ్య రామజన్మభూమిలో రామాలయ ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది. ప్రధాని మోదీ స్వయంగా ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఢిల్లీలో మోదీని కలిసి అహ్వానాన్ని అందించారు.

గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానన్న మోదీ..

రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ చెప్పుకున్నారు.ఈ రోజు భావోద్వేగంతో నిండుకున్న రోజు అని ఆయన ట్వీట్ చేశారు. తన జీవితంలో అత్యంత చారిత్రాత్మక సందర్భాన్ని చూడడం తన అదృష్టమని చెప్పుకున్నారు. మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆహ్వానించారని ఆయన చెప్పారు. జనవరి 22న దేవాతామూర్తులను ఆలయ అంతర్భాగంలో ప్రతిష్ఠిస్తారు. జై శ్రీరాం అంటూ ప్రధాని మోదీ నినదించారు.

మందిర్ వహీ బనాయేంగే నినాదం..

బీజేపీ మొదటి నుంచి రామాలయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రామాలయాన్ని రామజన్మభూమిలోనే నిర్మిస్తాం ( మందిర్ వహీం బనాయేంగే) అంటూ నినదించి, ఉద్యమించి అనుకున్నది సాధించింది. ఇందులో దశాబ్దాల శ్రమ, ఉద్యమం, కష్టం దాగొందని చెప్పక తప్పదు. సుదీర్ఘ కోర్టు కేసుల తర్వాత సుప్రీం కోర్టు తీర్పు మేరకే రామాలయ నిర్మాణం జరుగుతోంది. జనవరి 22కు ముందు తర్వాత కోట్లాది మంది రామభక్తులు ఆయోధ్యకు తరలి వస్తారని అంచనా. 2024 జనవరిలో కనీసం పది కోట్ల మంది అయోధ్య రాముడిని దర్శించుకుంటారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరవుతారు. దసరా పండుగ రోజున మోదీ, భగవత్ ఇద్దరూ రామాలయ అంశాన్ని ప్రస్తావించారు. త్వరలోనే ప్రారంభోత్సవం ఉంటుందని అన్నారు. దానికి పనులు వేగవంతమవుతున్నాయి.

డిసెంబరుకు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి..

అయోధ్య రామాలయాన్ని మూడంతస్తుల్లో నిర్మిస్తున్నారు. అందులో ప్రధానమైనది గ్రౌండ్ ఫ్లోర్. డిసెంబర్ నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుంది. 2020 ఆగస్టు 5న మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన తర్వాత పనులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోజువారీ సమీక్షిస్తున్నారు. ఆలయ పునాది, తెప్ప, స్తంభం పూర్తయిన తర్వాత రాజస్థాన్ బన్నీపూర్ రాయిని మూడు అంతస్తుల్లో పేర్చే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. గర్భగుడితో పాటు ఆలయంలో ఐదు మండపాలు ఉన్నాయి. గూడ్ మండప్, రంగ్ మండప్, నృత్య మండప్, ప్రార్థనా మండప్, కీర్తన మండప్ పునులు తుది దశకు చేరుకున్నాయి. గర్భగుడిలో మొత్తం మక్రానా పాతరాతి స్తంభాలు, దూలాలు ఏర్పాటు చేస్తున్నారు. సీలింగ్, వాల్ క్లాడింగ్ తో అందంగా చెక్కారు. ఆలయం మొత్తం వైశాల్యం 8.64 ఎరకాలు, పర్కోట పొడవు 762 మీటర్లుంటుంది. భక్తులకు పరిక్రమ సౌకర్యం ఉంటుందని ఆలయ కమిటీ ప్రకటించింది.