కాళ్లకి దారం కట్టే అలవాటుందా..మరి ఏ రాశులవారు ఏ రంగు దారం కట్టుకోవాలో తెలుసా!

దేవుడిని నమ్మేవారంతా ప్రతికూల శక్తులను కూడా విశ్వసిస్తారు. అందుకే ప్రతికూల శక్తులు దరిచేరకుండా రకరకాల పద్ధతులు ఫాలో అవుతారు. కొందరు పండితులు చెప్పినవి అయితే మరికొన్ని ఇంట్లో పెద్దలు చెప్పినవి. అలాంటి వాటిలో ఒకటి కాళ్లకు నల్లదారం కట్టుకోవడం. ఇంతకీ నల్లదారం కట్టుకోవచ్చా లేదా?

ఈ 3 రాశులవారికి నల్లదారం
చిన్నారులకు పెద్ద బొట్టు, బుగ్గ చుక్క, అరిపాదంలో కాటుక పెడతారు..ఎందుకలా అని అడిగితే దిష్టి తగలకుండా ఉంటుందని చెబుతారు. ఆడపిల్ల పెద్దైన తర్వాత కూడా చాలామంది తల్లిదండ్రులు ఆమె కాలికి నల్లదారం కడతారు. ఇతరుల కనుదృష్టి తగలకుండా, ప్రతికూల శక్తి దరిచేరకుండా ఇదో ఉపశమనం అని చెబుతారు. మరికొందరైతే ఫ్యాషన్ కోసం కూడా కట్టుకుంటున్నారు. నల్లదారానికి పూసలు జోడించి మరీ కట్టేవారు కూడా ఉన్నారు. అయితే నల్లతాడు అందరూ కట్టుకోకూడదంటారు పండితులు. ఇది కొన్ని రాశులవారికి మేలు చేస్తే మరికొన్ని రాశులవారికి కీడు చేస్తుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల తాడు కేవలం ధనస్సు, తుల, కుంభ రాశి వారు కట్టుకోవచ్చు కానీ వృశ్చిక రాశి, మేష రాశిలో జన్మించిన వారికి నల్ల తాడు కలిసిరాదట.

ఈ 2 రాశులవారికి ఎర్రదారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులలో మేషం, వృశ్చికం…ఈ రెండు రాశులకు అధిపతి గ్రహం అంగారక గ్రహం. ఈ గ్రహానికి నలుపు ఇష్టం ఉండదు, అంగారక గ్రహం ఎక్కువగా ఎరుపు ఇష్టపడతాడు. అందువలన ఈ రెండు రాశుల వారు నలుపు దారం కట్టుకోవడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా అంది అంతగా సక్సెస్ అవ్వదు, మనశ్సాంతి ఉండదు. అందుకే ఈ రెండు రాశులవారు ఎరుపు రంగు దారం కట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ధనుస్సు రాశి, తులారాశి, కుంభ రాశి వారు మాత్రం నల్లదారం కట్టుకోవడం వల్ల చెడు దృష్టి నుంచి ఉపశమనం లభించి మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని చెబుతారు.

నల్ల దారం ధరించేటప్పుడు మంచి సమయం చూసుకోవాలంటారు జ్యోతిష్యులు. ముందుగా రుద్ర గాయత్రి మంత్రం పఠించాలి. ఆ తర్వాత శని గాయత్రి జపించడం వల్ల ఈ తాడుకు మరింత శక్తి పెరుగుతుందని చెబుతారు

రుద్ర గాయత్రి మంత్రం
ఓం మహాదేవాయ విద్మహే భక్తజన వల్లభాయ ధీమహి
తన్నో శివః ప్రచోదయాత్

శని గాయత్రి మంత్రం
ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి
తన్నో శనిః ప్రచోదయాత్

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.