తెలంగాణలో జనసేనకు ఐదారు సీట్లు ఇవ్వనున్న బీజేీప – టీడీపీ పోటీకి దూరమే !

తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన మధ్య పొత్తులు ఉంటాయని ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది. తాము ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నానని పవన్ చెబుతున్నారు. తాము 31 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామని పవన్ కల్యాణ్ గతంలో ఓ జాబితా విడుదల చేశారు. తర్వాత పొత్తుల కోసం బీజేపీతో సంప్రదింపులు జరిపారు. చివరికి ఐదారు సీట్లు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ అంగీకరించిటనట్లుగా తెలుస్తోంది.

12 సీట్లు కేటాయించాలనుకున్నా అభ్యర్థులు లేని జనసేన

భారతీయ జనతా పార్టీ హైకమాండ్ జనసేన విషయంలో సానుకూలంగా ఉంది. ఆ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా 20 సీట్లు తమకు కేటాయించాలని కోరుతోంది. ఉమ్మడి ఖమ్మం, గ్రేటర్ పరిధిలో కొన్ని కీలక స్థానాలను అడుగుతోంది. పన్నెండు సీట్ల వరకూ ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. అసలు జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నట్లుగా ెలుస్తోంది. బీజేపీ జనసేన ముఖ్య నేతలు పోటీ చేయానుకుంటే 6 నుంచి 10 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కానీ బలమైన అభ్యర్థుల్ని చూపించలేకపోవడంతో చివరికి ఐదారు సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో జనసేన చేసిన పోరాటం ఏమీ లేదు !

తెలంగాణ జనసేన పార్టీ పూర్తిగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మీదనే ఆధారపడి ఉంది. వారంతా రాజకీయంగా ఓట్లు వేస్తారో లేదో ఎవరికీ తెలియదు. పార్టీ పరంగా జనసేన పార్టీ ఉనికి అసలు ఏ జిల్లాలోనూా లేదు. ఎప్పుడూ ఎలాంటి కార్యక్రమమూ చేయలేదు. ప్రభుత్వంపై పోరాడింది లేదు. కానీ రెండు, మూడు శాతం ఓట్లు అయినా చీలుస్తుందేమోనన్న అంచనాతో కొంత మంది సెటిలర్ల మద్దతు ఉంటుందన్న భావనతో బీజేపీ పొత్తునకు సిద్ధమయిందని చెబుతున్నారు.

టీడీపీ పోటీకి దూరమే – బీజేపీకి మద్దతు ప్రకటిస్తుందా ?

తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. హఠాత్తుగా మంగళవారం ఉదయం కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెంటనే స్పందించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు కూడా గతంలో ఓ సారి కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయినప్పుడు ఏ విషయం చెప్పలేదు. టీడీపీ పోటీ చేయకపోతేనే మంచిదన్న వాదనను కొంత మంది వినిపిస్తున్నారు. పోటీ నుంచి విరమించుకుని జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.