మహువా మొయిత్రాను తృణమూల్ సస్పెండ్ చేస్తుందా ?

క్యాష్ ఫర్ క్వశ్చన్ స్కాములో చిక్కుకుని ఊపిరాడక ఇబ్బంది పడుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు సొంత పార్టీ నుంచి కూడా కష్టాలు తప్పేలా లేవు. బీజేపీ నేతల దూకుడుతో డిఫెన్స్‌లో పడిపోయిన తృణమూల్ నిదానంగా స్పందిస్తోంది. పార్లమెంటులో ప్రశ్నలు సంధించినందుకు పారిశ్రామికవేత్త దర్శన్ హీరనందానీ నుంచి మొయిత్రా ముడుపులు పుచ్చుకున్న వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు పార్టీ అధిష్టానం అంటోంది.

సముచిత నిర్ణయమంటున్న డెరిక్ ఓబ్రెయిన్

మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరిక్ ఓబ్రెయిన్ తాజాగా స్పందించారు. పార్లమెంటరీ కమిటీ తన విచారణను పూర్తి చేసిన తర్వాత తమ పార్టీ అధిష్టానం ఆమె వ్యవహారంతో సముచిత నిర్ణయం తీసుకుంటుందని ఓబ్రెయిన్ చెబుతున్నారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కావాలనే మౌనంగా ఉంటున్నారని బీజేపీ ఆరోపిస్తున్న తరుణంలో ఓబ్రెయిన్ స్పందించారు.

మొయిత్రా వివరణ తీసుకున్న మమత
బీజేపీ ఆరోపించినట్లుగా మమతా బెనర్జీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న మాట నిజం కాదని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. దీనికి సంబంధించి మీడియా వార్తలు కూడా తమ దృష్టికి వచ్చాయని ఓబ్రెయిన్ వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని మొయిత్రాను పార్టీ అధిష్టానం ఆదేశించిందని, ఇప్పటికే మమతా దీదీకి ఆమె వివరణ ఇచ్చారని కూడా బ్రెయిన్ చెప్పారు. అదీ ఒక ఎంపీ హక్కులకు సంబంధించిన అంశం కావడంతో పార్లమెంటరీ ప్యానెల్ నిర్ణయం తర్వాతే పార్టీ చర్యలు ఉంటాయని ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఉదాసీనతకు తావులేదని కూడా ఆయన వెల్లడించారు..ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని నర్మగర్భంగా వెల్లడించారు.

దూకుడు పెంచిన బీజేపీ..

పారిశ్రామికవేత్త హీరనందానీ నుంచి డబ్బులు తీసుకుని మొయిత్రా తన పార్లమెంట్ లాగిన్ వివరాలు ఆయనకు అప్పగించారని బీజేపీ నేతలు ఆరోపించినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబె.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మొయిత్రాను తృణమూల్ పార్టీ నడిరోడ్డులో వదిలేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా మొయిత్రాను ఇంకా ఎందుకు పార్టీ నుంచి డిస్మిస్ చేయలేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఫోన్ చేసినా తృణమూల్ నేతలు అందుబాటులోకి రావడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పుడే కామెంట్ చేయబోమంటూ రెండు రోజుల క్రితం తృణమూల్ నేత కునాల్ ఘోష్ ఇచ్చిన వివరణతో బీజేపీకి కొత్త ఆయుధం దొరికినట్లయ్యింది. మొయిత్రాను మమత వెనుకేసుకొస్తున్నారని బీజేపీ ఆరోపణలు మొదలుపెట్టింది. పార్లమెంటు సభ్యురాలిగా ఆమెకు ఇచ్చిన విశేషాధికారాన్ని మొయిత్రా దుర్వినియోగపరిచారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఆచి తూచి వ్యవహరిస్తున్న తృణమూల్ నేతలు, మొయిత్రాపై చర్యలకు మాత్రం సిద్ధమవుతున్నారు. మరో పక్క మహువా మొయిత్రాపై లోక్ పాల్ విచారణకు ఆదేశిస్తారా లేదా చూడాలి. ఆమె మాత్రం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ, సీబీఐ వాళ్లు వస్తే తన ఇంట్లో చెప్పుల జతలు లెక్కబెట్టుకుని పోతారని ఎగతాళి చేస్తున్నారు.