హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆశ్వయుజ మాస పాడ్యమి నుంచి ఆస్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం దశమి రోజు రాముడు…రావణునిపై విజయం సాధించాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా ఇదే. అందుకే దసరా పండుగ రోజుల్లో రావణ వధ, జమ్మిచెట్టుకు పూజా చేయటం ఆచారంగా పాటిస్తారు.
దసరా ఎందుకు జరుపుకుంటారు
జగన్మాత దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి వధించి విజయాన్ని పొందిన సందర్భంలో 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండగ జరుపుకుంటారు. మహిషాసుర సంహారం కోసం త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన … దుర్గాదేవి 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, హిమవంతుడు కమండలము, సింహమును వాహనంగాను ఇచ్చారని దేవీ భాగవతంలో ఉంది. ఇలా సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. అప్పటి నుంచి మహిషుని సంహరించిన రోజును దసరా పర్వదినంగా పిలుస్తున్నారు. అదే విజయదశమిగా ప్రసిద్ధి చెందింది.
విజయదశమి ఎందుకు ప్రత్యేకం
సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుందని అంటారు. కనుక ఆ రోజు కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిదని చెబుతారు. అలానే ఆ రోజు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి. జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది అని నమ్మకం. దసరా రోజు ఉదయాన్నే తలకు స్నానం ఆచరించి..అమ్మవారి పూజ చేసి..శక్తి మేరకు నైవేద్యం సమర్పించాలి. సాయంకాలం అమ్మవారికి, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆనందోత్సాలతో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేస్తారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.