గజ్వేల్ ఓటమి ఖాయం – కేసీఆర్ చివరి ప్రయత్నాలు !?

గజ్వేల్ కేసీఆర్ ఓడిపోతున్నారని జరుగుతున్న విస్తృత ప్రచారానికి ఆయనే మరింత బలం ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ క్యాడర్ ను పిలిపించుకుని మంచి విందు ఇచ్చి బుజ్జగించినట్లుగా ఆయన చెప్పిన మాటలు విన్న బీఆర్ఎస్ నేతలకు… కేసీఆర్ ఇలా భయపడిపోతున్నారంటే అన్న ఆశ్చర్యం కలిగింది. తప్పుడు జరిగాయని.. అభివృద్ధి చేయలేకపోయానని..కార్యకర్తల్ని సరిగ్గా చూసుకోలేకపోయానని.. ముందు బాధితులకు అన్యాయం చేశానని మళ్లీ రాగానే అందర్నీ ఆదుకుంటానని ఆయన చెప్పడం కలకలం రేపుతోంది.

ఐదు వేల మందికి విందు – బతిమలాట

పదేళ్లలో గజ్వేల్ కార్యకర్తలను ఎప్పుడూ పట్టించుకోని సీఎం కేసీఆర్ తొలి సారి గజ్వేల్ నుంచి శామీర్ పేటలోని ఓ భారీ ఫంక్షన్ హాల్ కు ఐదు వేల మందిని పిలిపించుకున్నారు. మంచి విందు ఇచ్చి… అనేక మాటలు చెప్పారు. వచ్చే టర్మ్ లో నెలకు ఓ రోజు ఖచ్చితంగా కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఉన్నాయన్నారు. గజ్వేల్ కు పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ పట్టుమని పది సార్లు కూడా నియోజకవర్గంలో పర్యటించి ఉండరు. నిజానికి ఎక్కువ కాలం నియోజకవర్గంలో ఉంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్ గజ్వేల్ లోనే ఉంది. కానీ ఆయన ఎప్పుడూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఆ పర్యవసానమే ఈ బతిమిలాటలు.

ఈటల భయంతోనే కామారెడ్డిలో పోటీ !

కామారెడ్డిలో పోటీ చేయడానికి కారణం ఉందని కేసీఆర్ చెబుతున్నారు కానీ.. ఆ కారణం ఏమిటి… అనేది మాత్రం ఎక్కడా చెప్పడంలేదు. అక్కడ గెలిస్తే అక్కడే ఉంటానని మాత్రం చెప్పడం లేదు. గజ్వేల్ లోనే ఉంటానని చెప్పారు. అంటే కామారెడ్డిలో గెలిచినా సరే రాజీనామా చేస్తానని పరోక్షంగా చెప్పినట్లయింది. కేసీఆర్ రెండు చోట్ల పోటీ ప్రకటన తర్వాత.. గజ్వేల్ లో ఆయన పరిస్థితి గడ్డుగా ఉందని అందుకే కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. గజ్వేల్ లో ఈటల వంటి వారు పోటీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది.

గజ్వేల్ లో పార్టీ నేతల తీరుపై ప్రజల్ల ోఆగ్రహం

కేసీఆర్ ఎమ్మెల్యేనే. కానీ నియోజకర్గానికి ముగ్గురు ఇంచార్జులు ఉన్నారు. సొంత నియోజకవర్గంలో విపక్షం అనేదే ఉండరాదన్న ఉద్దేశంతో కేసీఆర్ బెదిరించే, బుజ్జగించే బతిమాలో బామాలో ఇతర పార్టీలలోని నాయకులందరినీ బీఆర్ఎస్ లోకి లాగేశారు. వారి స్థాయి, బలం ఇలా బేరీజు వేసుకుని కొందరిని నామినేటెడ్ పదవులలో నియమిస్తే.. మరి కొందరికి ఇతరత్రా లబ్ధి చేకూర్చారు. వారంతా ఎవరికి వారు రాజకీయం చేస్తున్నారు. ప్రజలకు వీరే కనిపిస్తున్నారు కానీ కేసీఆర్ కనిపించడం లేదు. తామ ఓట్లు వేసేది కేసీఆర్‌ కా… ఆయన పేరుతో నియోజకవర్గంలో చెలామణి అయ్యే వారికా అన్న డౌట్స్ కూడా ప్రజలకు ఉన్నాయి. అదే సమయంలో కొండపోచమ్మ సాగర్‌, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయాన్ని చెప్పి వారం, పది రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపి తగిన ఆదేశాలు జారీ చేస్తానన్నారు. కోడ్ వచ్చే వరకూ పరిష్కరించని సమస్యలు కోడ్ వచ్చాక పరిష్కరిస్తారని ఎవరూ అనుకోవడం లేదు.

కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఓటమి భయం నుంచి తప్పించకోవడానికి చేస్తున్న చివరి ప్రయత్నాలుగా భావిస్తున్నారు.