తెలంగాణ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసే పనిలో పడింది. శుక్రవారం తొలి జాబితాను ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఆ అభ్యర్థుల పేర్లను శుక్రవారం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఈ రోజు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.
సీనియర్లు అందరూ బరిలోకి !
అభ్యర్థుల జాబితా ఖరారుపై ఇప్పటికే బీజేపీ పలు సార్లు సమావేశాలు జరిపింది. తాజాగా గురువారం ఢిల్లీలో మరో సారి వరుసగా భేటీలు, చర్చలు జరిగాయి. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే జాబితాకు సంబంధించి బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
త్వరలో చేరికలకు అవకాశం
ఏ ఏ స్థానాల్లో పార్టీ బలంగా ఉంది? ఆశావాహులు ఎవరు? వారి బలాబలాలపై బీజేపీ అధిష్టానంతో రాష్ట్ర నేతలు చర్చించారు. ఎన్నికల్లో గెలవాలంటే చేయాల్సిన వాటిపై చర్చకు వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో తమ పార్టీ మేనిఫెస్టో గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. త్వరలో కొంత మంది కీలక నేతలు చేరే అవకాశం ఉండటంతో అలాంటి చోట్ల అభ్యర్థి పేర్లను పెండింగ్ లో పెట్టనున్నారు.
ప్రచార వ్యూహం ఖరారు
తెలంగాణలో సుడిగాలి పర్యటనలు, ప్రచారం ఉండాలనుకుంటున్నారు. ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఎక్కడ భారీ ర్యాలీలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే ఖరారైన ప్రణాళికను అమిత్ షా, నడ్డాలకు రాష్ట్ర నేతలు వివరించారు. ప్రజలు బీజేపీపై సానుకూలంగా ఉన్నారని, ప్రజలను మెప్పించగలిగితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నేతలు అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది.