ఇండియా గ్రూపులో ఒకరికి ఒకరంటే పొసగడం లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న వైఖరి రోజురోజుకు పెరిగిపోతోందన్న ఆగ్రహం అన్ని పార్టీల్లో ఉంది. లాభం వస్తే మొత్తం మాకే, నష్టం వస్తే మొత్తం మీకే అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైందని సమాజ్ వాదీ, జేడీయూ, తృణమూల్ లాంటి పార్టీలు ఆరోపణలు సంధిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరు ఎవ్వరికీ నచ్చడం లేదు…
కాంగ్రెస్ తీరుపై అఖిలేఖ్ అసహనం
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తుపై పునరాలోచన చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ఇతర పార్టీలను మోసం చేస్తోందని, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఆరు సీట్లు ఇచ్చే విషయంపై ఆలోచిస్తామని చెప్పి పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, ఎస్పీ జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉండదని తెలిస్తే తమ పార్టీ నాయకులను కమల్‌నాథ్‌తో మాట్లాడేందుకు పంపేవాళ్లమే కాదన్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో 144 మంది అభ్యర్థులను ప్రకటించగా.. వాటిలో 18 స్థానాల్లో ఎస్పీ కూడా అభ్యర్థులను నిలబెట్టింది. పైగా పొత్తులు లోక్ సభ ఎన్నికల కోసమేనని, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదని కమల్ నాథ్ ప్రకటించడం కూడా ఎస్పీకి కోపం తెప్పించింది.
బీజేపీకి గాలం వేస్తున్న నితీష్
బిహార్ సీఎం నితీశ్ కుమార్ పలు పర్యాయాలు బీజేపీతో చేతులు కలిపి విడిపోయారు. తరచూ ఆయన ఆ పని చేస్తూ ఉంటారు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉండే నితీశ్ తన పదవిని కాపాడుకునేందుకు కూటములు మార్చుతుంటారు. గత ఏడాది బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జెడీతో కలిసి బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది. ఇండియా గ్రూపు ఏర్పాటులో కీలక పాత్ర వహించిన బిహార్ సీఎం… ఇప్పుడు ఆ కూటమికి దూరం జరిగే పనిలో ఉన్నారు. ఇండియా గ్రూపు కన్వీనర్ పదవి తనకు ఇవ్వలేదన్న కోపం ఆయనలో ఉంది. పైగా జెండా, అజెండా రూపకల్పనలోనూ నేతలు పట్టించుకోవడం లేదన్న ఫీలింగ్ ఆయనకు కలుగుతోంది. దానితో బీజేపీకి దగ్గర జరగడమే మంచిదన్న ఆలోచన ఆయనకు వచ్చింది.అందుకే తాజాగా ఒక నినాదం అందుకున్నారు. బీజేపీ నేతలు తనకు మంచి మిత్రులంటూ చెప్పుకోవడం మొదలు పెట్టారు. తాను జీవించి ఉన్నంత కాలం బీజేపీతో స్నేహం కొనసాగుతుందని నితీష్ చెప్పుకున్నారు. ఎవరెక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదని, స్నేహం మాత్రమే ముఖ్యమని ఆయన అన్నారు. పైగా కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, తన లాంటి వారి ఆలోచనలను గౌరవం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఈ దిశగా మళ్లీ బీజేపీతో కలిసేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి….
నితీశ్ తో కలిసేది లేదన్న బీజేపీ
నితీశ్ ప్రకటన వచ్చిన వెంటనే బీజేపీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. బీజేపీ, నితీశ్ ఇద్దరూ దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్న మాట నిజమే అయినా… ఆయన తీరు సరికాదని కమలం పార్టీ నేతలు ప్రకటించారు.నితీశ్ కుమార్ కు తలుపులు ఎప్పుడో ముూసేశామని బీజేపీ ప్రకటించింది. ఈ సంగతి కేంద్రం హోం మంత్రి అమిత్ షా పదే పదే చెప్పారని గుర్తు చేసింది…