బీజేపీ తొలి జాబితాలో సంచలనాలు – తెలంగాణపై హైకమాండ్ ప్రత్యేక ప్లాన్ !

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ప్రకటిచే అవకాశం ఉంది. పార్టీ జాతీయ నాయకత్వం వద్ద దాదాపు 40-50 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా సిద్ధంగా ఉంది. ఈ జాబితాకు సీఈసీ ఆమోదం లభించిన వెంటనే ప్రకటిస్తారు. మొత్తం మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.

ఎన్నికలకు ప్రణాళికాబద్దంగా సిద్ధమైన బీజేపీ

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రణాళికాబద్దంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అభ్యర్థుల తొలి జాబితా విడుదలయిన తర్వాత అగ్రనేతలు వరుసగా పర్యటనలు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన కిషన్ రెడ్డి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సభలు, కేంద్రమంత్రుల పర్యటనలపై చర్చించారు. వచ్చే రెండు నెలల్లో అనేక మంది కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్‌ మొదటి వారంలోపు తెలంగాణలో 30 సభలు నిర్వహించనున్నారు.

సైలెంట్ గా ప్రజల్లో కలిసిపోతున్న కేంద్ర ప్రచార కమిటీ

కేంద్ర పార్టీ ఇరవైఆరు మందితో ఎన్నికలకమిటీని నియమించింది. వారికి ప్రచార బాధ్యతలను పంపిణీ చేశారు. వారు క్షేత్రక స్థాయిలో మీడియాలో పెద్దగా ప్రచారం లేకుండా నేరుగా ద్వితీయ శ్రేణి నేతలు, ఓటర్లతో కలిసిపోతున్నారు. మోదీ ప్రభుత్వ విజయాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విష్ణువర్ధన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి శోభాకరంద్లాజే విస్తృతంగా పర్యటించారు. వారి పర్యటనలకు మంచి స్పందన వచ్చింది. టిక్కెట్ల ప్రకటన తర్వాత మరింతగా ప్రచార కార్యక్రమాల జోరు సాగనుంది.

బాధ్యతాయుతమైన మేనిఫెస్టోపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ బీజేపీ ప్రత్యేకంగా బాధ్యతాయుత మేనిఫెస్టోపై దృష్టి పెట్టింది. ఇష్టానుసారంగా పథకాలు ప్రకటించకుండా.. అర్హులైన వారికి నిజంగా సాయం అవసరమైన ప్రతి ఒక్కరికి సాయం అందేలా పథకాలు రూపొందించనున్నారు. మోదీ ప్రభుత్వాన్నే స్ఫూర్తిగా తీసుకుని కొత్త పథకాలు సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలపై ఇప్పటికే ప్రజలు పెదవి విరిచారు. అవన్నీ ప్రజల్ని మోసం చేసే మేనిఫెస్టోలన్న నిర్ణయానికి వచ్చారు.