ముషీరాబాద్‌లో బీజేపీకి అడ్వాంటేజ్ – అభ్యర్థే కీలకం !

గ్రేటర్ హైదరాబాద్ లోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి ముషీరాబాద్. ఈ నియోజకవర్గం ఎవరికీ కంచుకోట కాదు. అన్ని పార్టీలకూ బలం ఉంది. బీజేపీకి కాస్త మొగ్గు ఉంటుంది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇక్కడ నుంచి రెండు సార్లు గెలిచారు. రెండు సార్లు టీడీపీలో పొత్తులో ఉన్నప్పుడే గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ పై 27 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేకు చాన్సిచ్చిన కేసీఆర్

ఈ సారి బరిలో ముఠాగోపాల్ బీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ తరపున అనిల్ కుమార్ బదులు ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీకి హాట్ సీట్ గా మారింది. ఖచ్చితంగా గెలుపు వస్తుందన్న నమ్మకంతో పోటీ ఎక్కువగా ఉంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ పార్టీకి చెందిన 36 మంది నేతలు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్‌ బీజేపీ గెలుపును కీలకంగా తీసుకోనున్నారు. ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

రేసులో దత్తాత్రేయ కుమార్తె

బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈసారి ఎన్నికల్లో తన వారసురాలినిని బరిలోకి దింపేందుకు అడుగులు వేస్తున్నారు. ఆయన నివాసం ఉంటున్న ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి తన కూతురు విజయలక్ష్మిని పోటీకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత కార్యకలాపాలు ప్రారంభించిన దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి డివిజన్ల వారిగా పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై చర్చించినట్లు సమాచారం. దత్తాత్రేయ కూడా కుమార్తె విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్ కోసం సాయం చేస్తున్నారు. ఇటీవల పలు పార్టీలు, ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ప్రచారంలోకి జయసుధ పేరు

ఇటీవల జయసుధ పార్టీలో చేరారు. ఆమె సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారని అనుకున్నా.. ఆమె పేరు ముషీరాబాద్ నుంచి పరిశీలిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు. పార్టీ బలానికి సొంత బలం కొంత జత చేసే వారు అయితే గెలుపు ఈజీ అని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.