అసెంబ్లీ ఎన్నికల్లో మరికొంతమంది ఎంపీలు

విజయాకవాశాలే ప్రాతిపదికగా బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడంతో పాటు.. ఢిల్లీ నుంచి నుంచి నేతలను దించింది. ఇంతవరకు ప్రకటించిన జాబితాల్లో 18 మంది ఎంపీలు, అందులో నలుగురు కేంద్ర మంత్రులు అసెంబ్లీ బరిలోకి దిగారు. ఇంకొంత మందిని శాసనసభకు పోటీ చేయించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ద్విముఖ వ్యూహంతో ముందుకు…

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహం పాటిస్తోంది. కొత్త వారికి అవకాశం ఇవ్వడం మొదటి వ్యూహమైతే, బలహీన నియోజకవర్గాల్లో ఎంపీలను నిలబెట్టడం ద్వారా బలాన్ని పెంచుకోవడం రెండోదిగా చెప్పాలి. పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి పట్టున్న ఎంపీలను మాత్రమే రంగంలోకి దించడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బకొట్టింది. వాళ్లు గెలుస్తారన్న విశ్వాసంతో రంగంలోకి దించిన బీజేపీ.. ఆయా నియోజకవర్గాల్లో ఓటమి పాలైన పక్షంలో వచ్చే ఎన్నికల్లో పూర్తిగా కొత్త మొహాలను సీటు ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఎంపీలను అసెంబ్లీకి పంపడం వెనుక మరో వ్యూహం కూడా ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 17 శాతం స్థానాలు వృత్తి నిపుణులైన యువకులకు కేటాయించాలని బీజేపీ తీర్మానించుకుంది. అదే క్రమంలో ఖచితంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు కూడా ప్రయత్నిస్తోంది.

అసెంబ్లీ బరిలోకి సింథియా

ఎంపీలను అసెంబ్లీ పోరులోకి దించడం బీజేపీకి కొత్తేమీ కాదు. ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ 2017లో అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పుడాయన గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్నారు. దీని వల్ల కొత్తవారికి అవకాశాలు కల్పించినట్లుగా ఉంటుందని కూడా లెక్కగడుతున్నారు. ప్రస్తుతానికి కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమార్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగన్ సింగ్ కులస్తే, రేణుకా సింగ్ ఎన్నికల బరిలోకి దిగారు. మరో ఇద్దరు జ్యోతిరాదిత్య సింథియా, అర్జున్ రామ్ మేఘవాల్ కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సామాజికవర్గం పరంగానూ, ప్రజాదరణ పరంగానూ వారిద్దరూ గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు..

65 ఏళ్లు దాటితే కష్టమే..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో భాగంగా లోక్ సభ వ్యూహాన్ని కూడా కొంత మేర ఆలోచిస్తున్నారు. 65 సంవత్సరాల వయసు దాటిన వారిని 2024లో పోటీ చేయించకూడదని అనుకుంటున్నారు. యూపీ, బిహార్లో డజను మంది 60 నుంచి 65 సంవత్సరాలు దాటిన వాళ్లు ఉన్నారు. వారి స్థానంలో వెనుకబడిన ఓబీసీ వర్గాలకు చెందిన యువ అభ్యర్థులను రంగంలోకి దించబోతున్నారు. దీని వల్ల లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే వీలుంటుంది. ఈ సారి సోషల్ ఇంజనీరింగ్ కు బీజేపీ పెద్ద పీట వేస్తోంది.