రాజస్థాన్ – దళిత ఓట్లే కీలకమా…

రాజస్థాన్లో ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తోంది. ఏ పార్టీ గెలిచినా కొన్ని ఫ్యాక్టర్స్ బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో దళిత ఓటు బ్యాంకు కూడా కీలక భూమిక పోషిస్తుందని చెప్పడానికి సందేహించకూడదు. ఆ రాష్ట్రంలో దళితుల ఓట్లే జయాపజయాలను నిర్దేశిస్తున్నాయని గత రెండు ఎన్నికలు నిగ్గు తేల్చాయి..

2018లో కాంగ్రెస్ కు మద్దతు

2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. అక్కడ దళిత జనాభా 18 శాతం ఉంది. 34 ఎస్సీ స్థానాలుంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ 19 చోట్ల గెలిచింది. దానితో ఆ పార్టీకి బొటాబొటీ మెజార్టీ వచ్చింది. ఒక కాంగ్రెస్ రెబెల్ కూడా గెలిచారు.

2013లో బీజేపీ స్వీప్

2013 ఎన్నికల్లో దళితులు బీజేపీ పక్షం వహించారు. 34 అసెంబ్లీ స్థానాల్లో 32 చోట్ల అప్పట్లో బీజేపీ విజయం సాధించింది. దళిత ఓట్ల బలం కారణంగానే 200 స్థానాలుండే రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీకి 163 వచ్చాయి. ఈ సారి కాంగ్రెస్ హయాంలో దళితులపై దౌర్జన్యాలు, అత్యాచారాలు ప్రధాన ప్రచారాస్త్రమవుతోంది. బీజేపీ దీనిపై భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. బీజేపీ భావసారూప్య సంస్థలు కూడా జనంలోకి వెళ్లి దళితులు పడుతున్న అగచాట్లను, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చిన నష్టాన్ని వివరిస్తున్నారు. ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ డెవలప్ మెంట్ ఫండ్ -2022 ఏర్పాటు చేసినా దాని వల్ల దళితులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో (ఎన్సీబీ) లెక్కల ప్రకారం దళితులపై దౌర్జన్యాలు, అత్యాచారాలు జరిగే రాష్ట్రాల్లో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. పైగా ఇటీవలే మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఘటన జరిగిన ప్రతీ ప్రాంతానికి బీజేపీ నిజనిర్ధారణ కమిటీలను పంపుతోంది. వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో బీజేపీ దళిత ఓట్లతో రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది..

బీఎస్పీ, కాంగ్రెస్ పట్ల దళితుల ఆగ్రహం

ఫిరాయింపు రాజకీయాల పట్ల దళిత ఓటర్లు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. 2019లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దానితో ఆగ్రహం చెందిన దళిత వర్గాలు వారి దిష్టిబొమ్మలకు చెప్పుల దండలు వేసి గాడిదల మీద ఊరేగించారు. 2018 ఎన్నికల ఫలితాల ప్రకారం రాజస్థాన్లో బీఎస్పీకి 4 శాతం ఓట్లున్నాయి. అయితే రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుకు వెళ్లడంతో పార్టీ సానుభూతిపరులు నిరాశలో మునిగిపోయారు. బీఎస్పీకి ఓటేసే బదులు తమ సంక్షేమానికి కృషి చేసే బీజేపీకి వేస్తేనే మేలు జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. మరి ఆ అవకాశాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటుందో లేదో చూడాలి…