వాస్తు సెంటిమెంట్స్ లేనివారు ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు కానీ వాస్తు నియమాలు పాటించేవారు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని ఆచితూచి ఆలోచిస్తారు. ఏ చిన్న లోపం ఉన్నాకానీ ఇంట్లో చాలా సమస్యలకు అదే కారణం అని భావిస్తారు. అయితే సమస్యలన్నింటికీ వాస్తు లోపమే కారణం అనుకోవాల్సిన లేదు కానీ కొన్ని మాత్రం పట్టించుకోవాలంటారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా నీటికి సంబంధించిన విషయాలు ఇంటి ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చేస్తాయంటారు.
డ్రైనేజీ వ్యవస్థ ఇలా ఉండాలి
బాత్రూమ్ నుంచి మొదలు బెడ్ రూమ్ వరకు ప్రతీది వాస్తు ప్రకారం ఉంటేనే మంచి జరుగుతుందని విశ్వసించే వాళ్లు చాలా మంది ఉంటారు. ఇక ఇంట్లో డ్రైనేజీ వ్యవస్థ విషయంలో కూడా వాస్తు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో సరైన విధానంలో లేకపోతే ఇంట్లో విపరీతమైన ఆర్థిక నష్టాలు, కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ తూర్పు పల్లంగా, పడమర ఎత్తుగా పండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దక్షిణం ఎత్తుగా, ఉత్తరం పల్లంగా ఉండాలని సూచిస్తున్నారు నీరు ఎప్పుడు పడమట నుంచి తూర్పు దిశగా కానీ దక్షిణం వైపు నుంచి ఉత్తరం దిశగా గానీ ప్రవహించాలి.
తూర్పు వైపు పల్లం ఉంటే
తూర్పు వైపు నీటిపారుదల ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవీ ఆశీస్సులు ఉంటాయి, సంపాదించినది చేతిలో మిగులుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలతో పాటు పురోగతి బాగుంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి తూర్పు నీటిపారుదల వ్యవస్థ ఉంటే ఉపయోగపడుతుంది.
ఉత్తర దిశలో నీటి ప్రవాహం ఉంటే
ఇంట్లో ఉత్తర దిశలో నీటి ప్రవాహం కూడా మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా ఉన్నా ఆ ఇంట్లో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు. అప్పులు చేసే అవసరం రాదు..వచ్చినా సమస్య లేకుండా మళ్లీ తీర్చగలుగుతారు
పశ్చిమం- దక్షిణ దిశల్లో ఉండకూడదు
ఒకవేళ డ్రైనేజీ వ్యవస్థ పశ్చిమం, దక్షిణం దిశలకు ప్రవహిస్తే మాత్రం ఏమాత్రం మంచిదికాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉంటే డబ్బు, జ్ఞానం కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాస్తు లోపం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు, ఎంత సంపాదించినా నిలవదు. ఒకవేళ డ్రైనేజీ వ్యవస్థ దక్షిణ దిశలో ప్రవహిస్తే కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం ఎదుర్కోవాల్సి వస్తుందని, ఊహించని ప్రమాదకర ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.