తెలంగాణలో మోగిన ఎన్నిక నగారా – నవంబర్ నెలాఖరు వరకు యుద్ధమే !

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ 3 నవంబర్‌ 2023న విడుదల అవుతుంది. అంటే 20 రోజులకుపైగానే సమయం ఉంది.
ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తేదీ అదే రోజు నుంచి అంటే 3 నవంబర్‌ 2023 నుంచి ప్రారంభం అవుతుంది. పదో తేదీ ఎన్నికల నామినేషన్లకు తుది గడువు . నామినేషన్ల స్క్రూట్నీని 13 వ తేదీ నిర్వహిస్తారు. 15 నవంబర్‌ 2023 వరకూ నామినే,న్ల ఉపసంహరణ గడవు ఉంటుంది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది.

జమిలీగా జరగాల్సిన ఎన్నికల్ని ముందుకు జరిపిన కేసీఆర్

2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్‌ఎస్‌, అప్పటి టీఆర్‌ఎస్‌… 119 స్థానలకుగాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్‌ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్‌. దాంతో ఈసారి కూడా ముందుగానే ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు కోటి 58 లక్షల 71 వేల 493 మంది ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నట్లు ప్రకటించింది. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 5.8 శాతం పెరిగినట్లు పేర్కొంది.

పెరిగిన ఓటర్ల సంఖ్య

కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలుగా ఉండగా.. 6.10 లక్షల ఓట్లను తొలగించినట్లు ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా లింగ నిష్పత్తి 998: 1000గా ఉందని తెలిపింది. ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్లను తొలగించిన తర్వాత 10 లక్షల మంది ఓటర్లు పెరిగారు. బోగస్ ఓట్లు తొలగింపు, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేపట్టిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ఈసీ సిద్దం చేసింది. ఓటర్ల జాబితాను సీఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు బూత్‌ల వద్ద లేదా వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితాను చెక్ చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది. గత ఎన్నికల సమయంలో కూడా అక్టోబర్ నెలలోనే షెడ్యూల్ వచ్చింది.

జోరుమీదున్న బీజేపీ

ఈ సారి తెలంగాణలో అధికారాన్ని దక్కించుకునే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. జోరు మీద ఉంది. ఇప్పటికే ప్రధాని రెండు సభల్లో ప్రసంగించారు. అమిత్ షా రేపు ఆదిలాబాద్ కు వెళ్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకమైన కకమిటీని నియమించారు. అందులో ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజులకూ చాన్సిచ్చారు. ఇప్పటికే బీజేపీ బలమైన ప్రత్యామ్నాయ సక్తిగా ఎదిగిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.