రమణ్ సింగ్ పైనే బీజేపీ ఆశలు…

కమలం పార్టీ వ్యూహాలు మార్చుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రాష్ట్రాలకు కలిపి ప్లానింగ్ చేస్తోంది. సిట్టింగ్ ఎంపీలను, ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయిస్తూ.. అడ్వాంటేజ్ తీసుకుంటోంది. కొత్త వారికి అవకాశం ఇస్తూ పాతకాపుల సేవలను సైతం విరివిగా వాడుకోవాలనుకుంటోంది.. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో అదే గేమ్ ప్లాన్ అమలు చేయబోతోంది..

రాజనందగామ్ నుంచే ఆయన పోటీ..

ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ను మళ్లీ ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ అభ్యర్థుల రెండో జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశం ఉంది. 2003 నుంచి 2018 వరకు మూడు పర్యాయాలు ఛత్తీస్ గఢ్ సీఎంగా సేవలు అందించిన రమణ్ సింగ్… 2018లో పార్టీ ఓడిపోయిన తర్వాత కాస్త నిదానించారు. పార్టీ కేంద్ర నాయకత్వం అందించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండిపోయారు. రాజనందగామ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమణ్ సింగ్.. మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తారు. రమణ్ సింగ్ బరిలో ఉండటం పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తుందని అధిష్టానం భావిస్తోంది..

భూపేష్ భాగెల్ కు చెక్ పెట్టేందుకే..

కాంగ్రెస్ సీఎం భూపేష్ భాగెల్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. మద్యంతో పాటు గేమింగ్ యాప్ స్కాం కూడా ఆయన చుట్టూ తిరుగుతోంది. ఐనా కాంగ్రెస్ పార్టీ మాత్రం తామే గెలుస్తామన్న ధీమాతో ఉంది. తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకుంటూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడిక్కడ బీజేపీ వారిపై దుష్ప్రచారాలు కూడా చేస్తోంది.కాంగ్రెస్ ను గట్టిగా ఎదుర్కోవాలంటే రమణ్ సింగ్ లాంటి సీనియర్ రాజకీయ దురంధరుడు కావాలని బీజేపీ లెక్కగట్టుకుంది. పైగా ఇతర రాష్ట్రాల మాదిరిగా రమణ్ సింగ్ కంటే బలమైన నాయకులు చత్తీస్ గఢ్ లో లేరని పార్టీ విశ్వసిస్తోంది.

ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా..

బీజేపీ ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించలేదు. కేవలం మోదీ ఛరిస్మా చూసి ఓటెయ్యాలని ప్రచారం చేస్తోంది. నేను ఉన్నాను, నా శ్రమను చూడండి, అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటెయ్యండని మోదీ చెబుతున్నారు. పార్టీ ప్రచారకులు కూడా మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తే భారత్ ప్రగతి పథంలో నడుస్తుందని చెబుతూ వస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలే కనిపించడం లేదు. ఛత్తీస్ గఢ్ మాత్రం డిఫరెంట్ అన్న ఫీలింగ్ రాబోతోంది. రమణ్ సింగ్ ను పరోక్షంగానైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇకపై మోదీ ప్రచార సభలకు వచ్చినప్పుడు రమణ్ సింగ్ పేరును పదే పదే ప్రస్తావించే అవకాశాలున్నాయని, అది కార్యకర్తలకు ఓటర్లకు సందేశమవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. కాంగ్రెస్ గెలిస్తే భూపేష్ భాగెల్ సీఎం అవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భాగెల్ కు బీజేపీలో పోటీ ఎవ్వరన్న చర్చకు కాంగ్రెస్ తెరతీస్తే ఏమవుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు బీజేపీ డిఫెన్స్ లో పడొచ్చు. అందుకే పరోక్షంగానైనా రమణ్ సింగ్ పేరును ప్రస్తావించాలనుకుంటోంది. కాకపోతే దీనిపై ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు…