మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఆయుర్వేద పరంగా ఎన్నో ప్రయోజనాలను అందించేవే. అలాంటి చెట్లలో సప్తపర్ణి చెట్టు కూడా ఒకటి. ఇది చూసేందుకు అలంకరణ చెట్టులా ఉంటుంది. కానీ ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. సప్తపర్ణి చెట్టును ఏడాకుల చెట్టు అని కూడా పిలుస్తారు. దీని కొమ్మల దగ్గర ఏడు ఆకులు గుంపుగా ఉంటాయి. అందుకనే దీన్ని ఏడాకుల చెట్టు అంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో బ్లాక్ బోర్డ్ ట్రీ అని, డెవిల్స్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ సప్తపర్ణి చెట్టు ద్వారా మనకు ఆయుర్వేద పరంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ చెట్ల ఆకులు, కాండం, పువ్వులు పలు విధాలుగా ఉపయోగపడతాయి.
దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం
ఈ చెట్టు కొమ్మల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దంతాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది, నోట్లో ఉండే బాక్టీరియా, క్రిములు నశిస్తాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
చర్మ వ్యాధుల నివారణకు
ఈ చెట్టు ఆకులను అనేక రకాల చర్మ వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా దద్దుర్లు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు ఈ ఆకులను ఔషధంగా వాడుతారు. దీంతో ఆయా సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.
అజీర్తి నివారిస్తుంది
అలాగే ఈ చెట్టు ఆకులను వాడితే పొట్టలో పురుగులు నశిస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆకలి సరిగ్గా అవుతుంది. ఆకలి లేని వారు, అజీర్తి సమస్య ఉన్నవారు వాడితే చక్కని ప్రయోజనం లభిస్తుంది.
బాలింతలకు మంచిది
జ్వరాన్ని తగ్గించేందుకు సప్తపర్ణి కషాయాన్ని ఉపయోగిస్తారు. మహిళలు ప్రసవం అనంతరం వీటిని తీసుకుంటే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.
బాలింతల్లో పాల ఉత్పత్తిని ఈ ఆకులు పెంచుతాయి.
మరెన్నో అనారోగ్య సమస్యలకు చెక్
ఈ ఆకులను పేస్ట్‌లా చేసి నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ ఆకులు రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ పనిచేస్తాయి. ఇవి మూర్ఛ రోగాన్ని కూడా తగ్గించగలవు. అలాగే పొట్టలో ఉండే అల్సర్లు, క్యాన్సర్ కణాలు నశిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి.
అయితే ఈ చెట్టు భాగాలను ఎలా పడితే అలా వినియోగించరాదు… ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వినియోగించాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.