వైసీపీలో బాగా నోరున్న నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇప్పుడు అందరికీ కాని వారయ్యారు. ఆయన నియోజకవర్గ పరిధిలో 22 మంది కార్పొరేటర్లు ఉంటే.. నలుగురు, ఐదుగురు తప్ప అందరూ ప్రస్తుతం వెల్లంపల్లితో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. వీరందరికీ వెల్లంపల్లినే టిక్కెట్లు ఇప్పించారు. తాను పదవులు ఇప్పించిన వారు కూడా తనను లెక్క చేయడం లేదు. హైకమాండ్ వద్ద పలుకుబడి కూడా తగ్గిపోయింది. పార్టీని భ్రష్టుపట్టించారన్న అభిప్రాయం ఉండటంతో హైకమాండ్ కూడా టిక్కెట్ విషయంలో ఆలోచిస్తోందని చెబుతున్నారు.
అందరినీ దూరం చేసుకున్న వెల్లంపల్లి
బెజవాడ కార్పొరేషన్‌లో గెలుపు వెల్లంపల్లి కృషేనని ఆయన చెప్పినట్లుగా మేయర్ పదవిని నగరాల సామాజిక వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మికి అప్పగించారు. ఇక దుర్గగుడి ఛైర్మన్ పదవి కూడ నగరాల సామాజిక వర్గానికి చెందిన పైలా సోమినాయుడు కు ఇప్పించారు. అయితే ఇప్పడు వెలంపల్లి మాజీ అయ్యారు.. దీంతో పరిస్దితులు ఒక్క సారిగా మారిపోయాయి.ఆయన సొంత నియోజకవర్గంలోని మేయర్ భాగ్యలక్ష్మి,తో పాటుగా ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అసంతృప్తితో వెలంపల్లికి దూరంగా ఉంటున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో వెలంపల్లి అన్ని తానే అయ్యి వ్యవహరించారని,ఇప్పుడు కూడ ఆయన అదే పై చేయి కోసం ప్రయత్నించటంతో మేయర్ అసంతృఫ్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక దుర్గగుడి ఛైర్మన్ సొమినాయుడు రెండు సంవత్సరాలు పని చేశారు. ఆ సమయంలో కరోనా తో కాలం గడిచిపోయింది.దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే మరో సారి అవకాశం ఇవ్వాలని అడిగితే మాట సాయం చేయలేదు. దీంతో ఆయన వర్గం కూడా అసంతృఫ్తిగా ఉంది. ఆయన బీజేపీలో కూడా పని చేశారు. అప్పట్నుంచి మైనార్టీలు అసంతృప్తిలో ఉన్నారు.
మైనార్టీకి వైసీపీ టిక్కెట్ కేటాయిస్తారా ?
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో తనకు టిక్కెట్ ఇవ్వకపోతే తాను సూచించిన వారికి టిక్కెట్ ఇవ్వాలని వెల్లంపల్లి కోరినట్టు వార్తలు వచ్చాయి. మైనార్టీ అభ్యర్థికి టిక్కెట్ కేటాయిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడి నుంచి ఎమ్మెల్సీగా నూరుల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేసినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. కానీ వెల్లంపల్లి మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నారు.
బెజవాడ పశ్చిమ జనసేనకు కేటాయించే అవకాశం
పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్‌తో పాటు టీడీపీ క్యాడర్ కూడా బలంగా ఉంది. జనసేనలో తన నియోజకవర్గంలో యాక్టివ్‌గా పని చేసే నేతల్లో ఒకరు అయిన పోతిన మహేష్ సీరియస్‌గా వెల్లంపల్లిపై పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు పధ్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి. 58 వేల ఓట్లు వెల్లంపల్లికి వస్తే.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జలీల్ ఖాన్ కుమార్తెకు యాభై వేల ఓట్లు వచ్చాయి. పోతిన మహేష్ ఇరవై రెండు వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఈ సారి వెల్లంపల్లిపై తీవ్ర వ్యతిరేకత ఉండటం… పొత్తు పరిణామాలు… మాజీ మంత్రికి నిద్రలేకుండా చేస్తున్నాయి. అందుకే అభ్యర్థిని మార్చాలన్న ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లుా చెబుతున్నారు.