నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ తరపున తిరుగులేని నేతగా ఉన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మొదట్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసినా తర్వాత సూర్యాపేటకు వచ్చి ఉద్యమం సెంటిమెంట్ తో సెటిలైపోయారు. మరొకర్ని ఎదగనీయడం లేదు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన.. జగదీష్ రెడ్డి.. 2014లో ఈ నియోజకవర్గం నుంచి కేవలం రెండు వేల ఓట్ల తేడాతో .. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. గత ఎన్నికల్లో సీటు మారుతారని ప్రచారం జరిగినా.. సూర్యాపేట నుంచే పోటీ చేశారు. సెంటిమెంట్‌తో మళ్లీ గెలిచారు. కానీ ఈ సారి మాత్రం బీజేపీ అభ్యర్థి సంకినేని ఆయనకు చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి సంకినేనికి బలం
నియోజకవర్గంలో పట్టు ఉండటంతో.. సంకినేని వెంకటేశ్వరరావు 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జగదీష్ రెడ్డి పై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. జిల్లాలో బీజెపిని బలోపేతం చేశారు. మొదటినుంచి టిడిపి, వైసిపి పార్టీలో ఉన్న తన కార్యకర్తలు, అనుచరవర్గం తో బిజెపిని బలోపేతం చేశారు. బీజేపీ టిక్కెట్ ఆయనకే ఖరారు అవుతుంది. పలుమార్లు అ కేంద్ర మంత్రులను సైతం సూర్యాపేటకు తీసుకొచ్చి సభలు నిర్వహించి బిజెపిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని ఈసారి సూర్యాపేట ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తానని అత్యంత పట్టుదలతో ఉన్నారు.
కాంగ్రెస్ లో వర్గ పోరాటం
సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లో ను టికెట్ ఎవరికి వస్తుందోనని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ తో పాటు పార్టీలో చేరిన పటేల్ రమేష్ రెడ్డి టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ దామోదర్ రెడ్డి కి ఉంది. 2014 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టిడిపి నుంచి పోటీ చేసిన పటేల్ రమేష్ రెడ్డి లు పోటీ చేశారు. నీరిద్దరూ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఏఐసీసీ స్థాయిలో విస్తృత పరిచయాలు ఉన్న దామోదర్ రెడ్డి టికెట్ పై ధీమాతో ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డి తన ఆశలన్నీ రేవంత్ రెడ్డి పైనే పెట్టుకున్నారు. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు సహకరించడం కష్టమే.
త్రిముఖపోరులో బీజేపీకి అడ్వాంటేజ్ !
ఏ విధంగా చూసినా.. సూర్యాపేటలో ఈ సారి త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడటం ఖాయమే. ప్రభుత్వ వ్యతిరేకత ఏ కొంచెం కనిపించినా.. జగదీష్ రెడ్డికి గడ్డు కాలమేనని.. మెజార్టీ ప్రజల అభిప్రాయం. బీజేపీ బలంగా మారడం.. సంకినేని వ్యక్తిగత ఇమేజ్ ఆయనను ఈ సారి చట్టసభలకు పంపుతుందని భావిస్తున్నారు.