పుంగనూరులో పెద్దిరెడ్డికి పోటీ ఉందా ? రామచంద్ర యాదవ్ సత్తా ఎంత ?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నేత. వైసీపీలో ఆయన నెంబర్ టు. జిల్లాలోని నియోజకవర్గాలన్నింటిని శాసిస్తూంటారు. అలాంటి నేత పోటీ చేస్తున్న నియోజకర్గం పుంగనూరు. తిరుగులేని మెజార్టీతో గెలుస్తూ వస్తున్న ఆయనకు ఈసారి అటు టీడీపీతో పాటు బీజేపీ మద్దతు ఉన్న రామచంద్రయాదవ్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉండే రామచంద్ర యాదవ్

చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. ఇన్నాళ్లూ నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా పెద్దిరెడ్డికి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయారు. దాంతో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ మంత్రిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. అయితే రాబోవు ఎన్నికల్లో అతనికి యంగ్ బిజినెస్‌మెన్ రామచంద్ర యాదవ్ రూపంలో గట్టి పోటీ ఎదురుకాబోతోంది. 2024 ఎలక్షన్స్ కోసం అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన రామచంద్ర యాదవ్.. నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఆయన ఇటీవల బీసీవై పార్టీని పెట్టి.. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన బీసీ కావడమే కాదు దండిగా ఆర్థిక మద్దతు కూడా ఉండటంతో గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన రామచంద్ర యాదవ్

రామచంద్ర యాదవ్ 2019 ఎన్నికల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఢీకొన్నారు. అప్పట్లో జనసేన తరఫున పోటీ చేసిన ఆయనకు 16,452 మాత్రమే. కానీ పెద్దిరెడ్డి‌కి మాత్రం ఏకంగా 1,07,431 ఓట్లు పడ్డాయి. రాబోవు ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. అప్పట్లో టీడీపీ అభ్యర్థి ఎన్. అనీషా రెడ్డి‌కి 63,876 ఓట్లు పడ్డాయి. ఓవరాల్‌గా టీడీపీ + జనసేన ఓట్లు కలిపితే 80,328 ఓట్లు అన్నమాట. ఓట్ల శాతంగా చూసుకున్నా ఈ రెండు పార్టీలు అప్పట్లో సుమారు 41% ఓట్లని నియోజకవర్గంలో దక్కించుకున్నాయి. అయితే రామచంద్ర యాదవ్ ఈ రెండు పార్టీల్లోనూ లేరు. సొంత పార్టీ పెట్టుకున్నారు. అందుకే అక్కడ త్రిముఖ పోటీ జరగనుంది.

గట్టిగా ప్రయత్నిస్తున్న రామచంద్ర యాదవ్

పుంగనూరు నియోజకవర్గంలోని రైతు సమస్యలపై సదుంలో రైతు భేరి సభని నిర్వహించాలని రామచంద్ర యాదవ్ ప్రయత్నించారు. కానీ.. ఆ సభకి పోలీసులు అనుమతించలేదు. దాంతో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అయితే ఆ ర్యాలీ ముగిసిన గంటల వ్యవధిలోనే ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంటి ఆవరణలోని కార్లని, ఫర్నిచర్‌‌ని ధ్వంసం చేసింది. చివరికి పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకి రామచంద్ర యాదవ్ అప్పట్లో ఫిర్యాదు చేయడంతో పాటు నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వై ప్లస్ కేటగిరి భద్రతని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్నుంచి ఆయనకు క్రేజ్ పెరిగింది. సొంత పార్టీతో ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ద్విముఖ పోటీ అయితే .. పెద్దిరెడ్డికి హోరాహోరీ పోరు.. త్రిముఖ అయితే.. ఈజీగా గెలుస్తారన్న అంచనాలు ఉన్నాయి.