తెలంగాణ బీజేపీ పూర్తి యాక్షన్ మోడ్ లోకి వచ్చేసింది. తెలంగాణ ఎన్నికలకు సహకరించేందుకు కేంద్ర పార్టీ ఏర్పాటు చేసిన ఇరవై ఆరు మందితో కూడిన కమిటీ పని ప్రారంభించింది. హైదరాబాద్‌లో గురువారం ఈ అంశంపై విస్తృత సమావేశం జరిగింది. ఇందులో ఏపీ నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వీరంతా క్షేత్ర స్థాయిలో పార్టీ వ్యూహాలను అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించనున్నారు.
ప్రధాని పర్యటనల తర్వాత హుషారు
ప్రధాని పాలమూరు, ఇందూరు సభల తర్వాత బీజేపీలో హుషారు పెరిగింది. పసుపుబోర్డు, గిరిజన యూనివర్సిటీల ప్రకటన పార్టీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని పార్టీ భావిస్తోంది. తెలంగాణలో ముందు నుంచి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపైనే ఫోకస్ పెడుతూ వస్తోంది బీజేపీ. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ప్రకటించడంతో ఆ దిశగా పెద్ద అడుగు పడినట్టేనని భావిస్తున్నారు. ఈ టెంపోను ఇలాగే కొనసాగించేందుకు త్వరలో నిర్మల్, కరీంనగర్‌లో మోదీతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ చెబుతోంది.
నడ్డా నేతృత్వంలో స్టేట్ కౌన్సిల్ భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వవచ్చారు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ భేటీలో పాల్గొంటున్నారు. తెలంగాణలో బీజేపీని ఎన్నికలకు సర్వసన్నద్దం చేయడంతోపాటు గెలుపు వ్యూహాలపై అందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్మల్, కరీంనగర్ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈలోపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటిస్తారు. అమిత్‌షా షెడ్యూల్ 10వ తేదీన ఫిక్స్ చేశారు. మోదీ, షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి జాతీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తెలంగాణలో దించుతోంది బీజేపీ.
పార్టీ నేతలంతా యాక్టివ్ – కిషన్ రెడ్డి మాస్టర్ ప్లాన్
రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చారన్న వివరాలను కేంద్ర బీజేపీ పెద్దలతోనే చెప్పించేందుకు స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెలరోజుల్లో రోజుకో సభ ఉండేలా.. మొత్తం 119 నియోజకవర్గాల్లో 30 నుంచి 40 సభలు పెట్టేలా ఓ సరికొత్త వ్యూహరచన చేశారు. బెంగాల్‌లోనూ సరిగ్గా ఇదే స్ట్రాటజీతో వెళ్లింది బీజేపీ. అక్కడ కేంద్ర బీజేపీ పెద్దలతో వరుస సభలు పెట్టించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధులను ఆ లీడర్లతోనే చెప్పించింది. ఆ ప్రయత్నంతోనే బెంగాల్‌లో జీరో నుంచి బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది బీజేపీ. అదే స్ట్రాటజీని తెలంగాణలోనూ అమలు చేస్తోంది. అసంతృప్త నేతలందరికీ.. పలు కమిటీల చైర్మన్లుగా నియమించారు. వారంతా యాక్టివ్ గా పని చేసేందుకు రెడీ అయ్యారు.