ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్రలు కూడా ఒకటి. మారిన మన ఆహారపు అలవాట్లు అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. కొర్రల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. కొర్రలు బరువు తగ్గడానికి మాత్రమే కాదు శరీరానికి కలిగే ప్రయోజనాలు అందిస్తుంది.
కొర్రలతో ఎన్ని ఉపయోగాలో!
కొర్రలని ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
కొర్రలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.
వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదపడుతుంది.
కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోతాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి
టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది
కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి
నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో కూడా కొర్రలు సహాయపడతాయి
స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించే గుణం కూడా వీటికి ఉంది
కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది
ఈ కొర్రలతో దోశ వేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు..అన్నం వండుకుని తింటే ఇంకా మంచిది
కొర్రన్నం ఇలా వండితే రుచి
గిన్నెలో ఒక టీ గ్లాస్ కొర్రలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత 3 టీ గ్లాసుల నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకుని వేడి చేయాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత నానబెట్టుకున్న కొర్రలను వేసి ఉడికించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా దగ్గర పడే వరకు ఉడికించాలి. అవసరమైతే మరో అర గ్లాస్ నీళ్లు పోసుకుని ఉడికించాలి. కొర్రలు మెత్తగా ఉడికి
దగ్గర పడిన తరువాత మూత పెట్టి నీరంతా పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని పొడి పొడిగా ఉండే కూరలు, ఫ్రైలతో కాకుండా పప్పు, సాంబార్, పెరుగుతో తింటే రుచిగా ఉంటుంది. కొర్రలను బాగా నానబెట్టకపోయినా మెత్తగా ఉడికించకపోయినా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.