ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశానన్న పవన్ కల్యాణ్ – ఏపీబీజేపీ నాయకత్వం కోరుకుంంది ఇదేనా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా వారాహి యాత్రలో తాను క్రమంగా బీజేపీకి దూరమయ్యానన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి టీడీపీతో కలిశానని ప్రకటించారు. ఈ ప్రకటన ఒక్క సారిగా వైరల్ అయింది. ఓ వైపు బీజేపీ నేతలు పవన్ తో పొత్తులో ఉన్నామంటున్నారు. కానీ పవన్ అదేమీ లేదంటున్నారు. మొత్తంగా ఏపీ బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేలా.. పొత్తుల వ్యవహారంలో రాజకీయం నడుస్తోందన్న అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి.

బీజేపీతో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారో పవన్ కైనా తెలుసా ?

జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎప్పుడూ అనుకోలేదు. జనసేన పార్టీ చీఫ్ మొదటి సారి 2013లో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అహ్మదాబాద్ వెళ్లి మోదీని కలిసి మరీ మద్దతు ప్రకటించారు. తర్వాత ఆయన బయటకు వెళ్లారు. మళ్లీ 2019 ఎన్నికల తర్వాత ఆయనే వచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆయన ఎందు కోసం పొత్తులు పెట్టుకున్నారో పవన్ కే క్లారిటీ లేదు . ఎప్పుడూ ఏపీ బీజేపీతో కలిసి పని చేయలేదు. చివరికి ఇప్పుడు ఓట్లు చీలిపోకూడందటూ టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు.

పవన్ ను కావాలని టీడీపీ వైపు నెట్టేసినట్లుగా పరిణామాలు

ఎన్నికలకు ముందు పొత్తుల అంశం చర్చలకు వస్తాయి. ఏపీ బీజేపీ నాయకత్వం క్రమంగా టీడీపీ వైపు జనసేన మొగ్గుతోందని తెలిసినా కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రాంతీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా బీజేపీతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం చేసుకుంటున్నాయి. వీటిని తిప్పికొట్టి..తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉందని గట్టిగా చెప్పుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమయింది. పవన్ కల్యాణ్.. టీడీపీతో కలుస్తానని ప్రకటించిన తర్వాత ఆయనకు పరిస్థితిని వివరించి.. రాజకీయంలో బీజేపీతో కలిసి ఉంటే మళ్ల గురించి చెప్పడంలో విఫలమయ్యారు. ఓ రకంగా జనసేన టీడీపీతో వెళ్లాలన్నట్లుగా వ్యవహరించారన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

ఏపీ బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలు

ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తుందా లేకపోతే… పోటీ చేయకుండా ఉండటం ఉత్తమం అన్నట్లుగా మారుస్తుందా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. పొత్తుల కోసం వెంపర్లాడుతూ.. పొత్తులు లేకపోతే పోటీ చేయడం దండగన్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాకు లీకులిస్తున్నారు. కొంత మంది ప్రత్యేక ఇంటర్యూలు ఇస్తూ బీజేపీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా ఓ ప్రణాళికా ప్రకారం జరుగుతోందని సంప్రదాయ బీజేపీ క్యాడర్ అసంతృప్తికి గురవుతోంది.