బిహార్ కుల గణన అనేక ప్రశ్నలను ఆవిష్కరించింది. ఈ చర్య దేశాన్ని సామాజిక న్యాయం దిశగా తీసుకెళ్తుందని ఇండియా గ్రూపు నేతలు చెబుతుండగా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. కులాల విషయంలో ఆచి తూచి అడుగులు వేయకపోతే ఏ పార్టీకైనా ఇబ్బందులు తప్పవని వరుస ఎన్నికలు నిరూపించారు. అందుకే కాంగ్రెస్ నేతృత్వ కూటమి చేసిన పనికి బీజేపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పేదరికమే ఒక కులమని ఛత్తీస్ గఢ్ ర్యాలీలో ప్రకటించిన ప్రధాని మోదీ సేఫ్ గేమ్ ఆడారనుకోవాలి…
ఆ 105 నియోజకవర్గాలే కీలకం
జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ అని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అంటే జనాభాను బట్టి హక్కులు కల్పించారన్నది వారి వాదన. బీసీలు, ఎస్సీ,ఎస్టీలే అన్ని చోట్ల అధిక సంఖ్యాకులు అపుతారనుకుంటే మాత్రం కష్టమే. ఎందుకంటే మధ్యప్రదేశ్లోని 105 నియోజకవర్గాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 60 నియోజకవర్గాల్లో బ్రాహ్మణ ఓట్లు కీలకమవుతాయి. 45 నియోజకవర్గాల్లో ఠాకూర్లు కీలక భూమిక వహిస్తారు. మధ్యప్రదేశ్లోని వింధ్య ప్రాంతంలో బ్రాహ్మణ ఆధిపత్యం ఉంది. రాష్ట్రంలోని అగ్రకులాల ఓట్లలో 29 శాతం ఆ ప్రాంతంలోనే ఉన్నాయని అజీం ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో తేలింది. అక్కడి ఏడు జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్రకులాల అభ్యర్థులే గెలుస్తున్నారు. 23 నియోజకవర్గాల్లో 30 శాతం మంది బ్రాహ్మణ ఓటర్లున్నారు. రాష్ట్రం మొత్తం మీద చూస్తే 45 లక్షల బ్రాహ్మణ ఓట్లున్నాయి. రాష్ట్ర మొత్తం ఓటర్లలో అది పది శాతమవుతుంది.
ఛంబల్, మహాకౌశల్ ప్రాంతంలో కూడా…
వింధ్య ప్రాంతం మాత్రమే కాకుండా ఛంబల్ ,మహాకౌశల్ ప్రాంతాల్లోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు నిర్ణయాత్మక భూమిక పోషిస్తారు. హోసానాబాగ్ నియోజకవర్గంలో గత 61 సంవత్సరాల్లో 22 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు గెలిచారు. ఠాకూర్లు సంహభాగం ఉండే 45 నియోజకవర్గాలు కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ఠాకూర్లు బాగా ప్రాబల్యమున్న కులమే అవుతుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో ఎనిమిది మంది ఠాకూర్ మంత్రులున్నారు. మంత్రివర్గంలో 34 మంది ఉంటే అందులో ముగ్గురు బ్రాహ్మణులు, ఎనిమిది మంది ఠాకూర్లు, ఒక్కరు కాయస్తులు. ప్రస్తుతం 34 మంది ఠాకూర్ ఎమ్మెల్యేలున్నారు. వారిని మంచి చేసుకునేందుకే మహారాణా ప్రతాప్ జయంతిని రాష్ట్రప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.
సంనాతన వివాదంపై చర్చ..
చాలా కాలంగా బ్రాహ్మణులు, ఠాకూర్లు బీజేపీ వైపే ఉన్నారు. అందుకే మధ్యప్రదేశ్లో రెండు దశాబ్దాలుగా పైగా ఆ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ .. సనాతన ధర్మాన్ని విడనాడాలని చేసిన వ్యాఖ్యలతో మధ్యప్రదేశ్ అగ్రకులాల వారు ఆగ్రహం చెందారు. అనేక చోట్ల నిరసనలు నిర్వహించారు. ఆ నిరసనలకు బీజేపీ పూర్తి స్థాయి మద్దతునిచ్చింది.మరో పక్క రాష్ట్ర బీజేపీ నిర్వహించిన జన ఆశీద్వార్ యాత్రలకు కూడా అగ్రకులాల ఓటర్ల నుంచి మంచి స్పందనే వచ్చింది.