శనివారం రోజు అస్సలు కొనుగోలు చేయకూడని 6 వస్తువులు

హిందువులకు శనివారం అంటే శనికి అంకితం చేసే రోజుగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రంలో శని అంటే భయపడతారు. ఈ ఒక్క గ్రహం సరైన స్థానంలో ఉంటే అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. అందుకే శనిని ప్రశన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. వీటితో పాటూ శనికి నచ్చని కొన్ని పనులు చేయకుండా ఉంటే శనిదోషం ఇంకా తగ్గుతుందని చెబుతారు పండితులు. ముఖ్యంగా శనివారం కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదని సూచిస్తారు. అవేంటి…ఎందుకు కొనద్దని చెబుతారో తెలుసుకుందాం..

తోలు వస్తువులు
తోలుతో తయారు చేసినవి..అంటే.. షూస్, బెల్టులు, పర్సులు లాంటివి శనివారం అస్సలు కొనుగోలు చేయకూడదు. ఈ రోజు వీటిని కొన్నవారికి అప్పులు పెరుగుతాయని పండితులు చెబుతారు. అంతే కాదు వాటిని కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో సమస్యలు పెరుగుతాయంటారు. అయితే తోలు వస్తువులను శనివారం రోజు దానం చేస్తే మాత్రం మంచి జరుగుతుంది. శనిదేవుడి అనుగ్రహ లభిస్తుంది.

నల్ల నువ్వులు
శనివారం రోజు నువ్వులు కొనుగోలు చేయకూడదని ఇంట్లో పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు..మరీ ముఖ్యంకా నల్ల నువ్వులు అస్సలు కొనుగోలు చేయకూడదు. ఈ రోజు నల్ల నువ్వులు కొనుగోలు చేస్తే తలపెట్టిన పనులకు ఆంటంకం కలుగుతుందంటారు. అయితే నల్లనువ్వులు, ఆవనూనెతో శనికి పూజచేస్తే శనిదోషం తొలగిపోతుంది

ఇనుము
ఇనుముతో చేసిన వస్తువులు శనివారం రోజు కొనుగులో చేయడం అంత మంచిది కాదు. ఈ రోజు ఇనుము కొనుగోలు చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుందని నమ్ముతారు. చివరికి చిన్న కత్తెర కూడా కొనకూడదు. శనివారం ఇనుము కొన్న వారింట్లో కుటుంబ సంబంధాల మధ్య వివాదాలు వస్తాయంటారు. ఈ రోజు ఇనుమును దానం చేస్తే శని ఆగ్రహం మీపై తగ్గి అనుగ్రహం ప్రసరిస్తుంది.

ఆవనూనె
మత విశ్వాసాల ప్రకారం శనివారం రోజు ఆవాల నూనెను కొనుగోలు చేస్తే శనిగ్రహ ఆగ్రహానికి గురవుతారు. ఆవాల నూనెను శనివారం కొనుగోలు చేయడం కూడా వ్యాధికి కారణమని భావిస్తారు. ఆవనూనెతో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది.

బొగ్గు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు బొగ్గు కొనుగోలు చేయడం చాలా అశుభం. దీని వల్ల శని దోషం వచ్చి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. నలుపు రంగు దుస్తులు కూడా ఈ రోజు కొనకూడదు. అయితే ఈ రోజున నల్లని వస్త్రాలు ధరించి దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

ఉప్పు
శనివారం ఉప్పు కొనకూడదని నమ్ముతారు. శనివారం రోజున ఉప్పును ఇంట్లోకి తీసుకురావడం వల్ల కుటుంబంలో అప్పులు పెరుగుతాయని భావిస్తారు. ఇందుకే ఉప్పు శనివారం మినహా ఇంకేరోజైనా కొనుగోలు చేయొచ్చు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.