భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ. దేశంలో తిరుగులేని పార్టీ. ఓ రాష్ట్రంలో వీక్ గా ఉండొచ్చు. మరో రాష్ట్రంలో బలంగా ఉండవచ్చు. కానీ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ. మరి ఆ పార్టీ బలాన్ని ఉపయోగించుకునే పరిస్థితి అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు ఉంటుందా అంటే… ఆయా నేతల్ని బట్టి ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఏపీనే ఉదాహరణ. బీజేపీతో పొత్తులో ఉన్నమని జనసేన చేస్తున్న ప్రకటనలు.. మళ్లీ టీడీపీతో కలిసిపోయి చేస్తున్న రాజకీయం చూసిన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వం గట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ జనసేన విషయంలో ఎలాంటి ప్రకటనా చేయడం లేదు.
జనసేన ఉద్దేశం క్లియర్
జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతోంది కేవలం గిలిగింతలు పెట్టడానికే. బీజేపీతో ఉంటే ఓట్లు వస్తాయి సీట్లు రావని అవగనిగడ్డలో ఆయన ప్రకటించినప్పుడే బీజేపీ పవన్ తీరుపై స్పష్టత వచ్చింది. మరి అలాంటప్పుడు గట్టిగా ఎదురుదాడి చేయాల్సిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటోందో పలువురు నేతలకు అర్థం కావడం లేదు. జనసేన టీడీపీతో వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చని.. బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేయడం ఆపేయాలని.. తమ విధానం తమకు ఉంటుందని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది.
హైకమాండ్ సూచనలు పట్టించుకోరా ?
బీజేపీకి నాయకత్వాన్ని మార్చిన ఉద్దేశం ఏమిటో హైకమాండ్ స్పష్టంగానే సూచనలు ఇచ్చింది. బీజేపీ సొంతంగా ఎదగడానికి అవకాశాలు కల్పిస్తామని… ఆ ప్రకారం పని చేసుకోవాలని సందేశం ఇచ్చారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం వేరే విధంగా ఆలోచిస్తోంది. దీంతో మొత్తం వచ్చిన అవకాశాలన్నీ నేలబారు అవుతున్నాయి. చివరికి బీజేపీని అందరూ వింతగా చూసే్ పరిస్థితి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయాల్లో బీజేపీ దూకుడుగా వెళ్లి ఉంటే.. ఓ ప్రాంతీయ పార్టీ స్థానాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉండేది. చేజేతులా ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
పొత్తులంటే హైకమాండ్ చెబుతుంది కదా – లేకపోతే సైలెంట్ గా ఉంటారా ?
పొత్తులు ఉంటాయా లేదా అన్న సంగతి హైకమాండ్ చూసుకుంటుంది. ఉన్నా లేకపోయినా రాష్ట్ర నాయకత్వం తాము చేయాల్సిన పనుల్ని చేయాల్సి ఉంటుంది. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఏపీలో రాష్ట్ర నాయకత్వంపై పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు .. పొత్తుల సంగతిని పక్కన పెట్టి.. ఎన్నికలకు సిద్ధమయ్యే కార్యక్రమాలు చేపట్టడంలో విపలమయ్యారన్న వాదన వినిపిస్తోంది. జనసేన ముందు పార్టీని తేలిపోయే పరిస్థితి తీసుకు వస్తున్నారని క్యాడర్ మథనపడుతోంది.