మోదీ ప్రభుత్వ దృఢసంకల్పానికి ఎవరైనా తలొగ్గాల్సిందే. ఇతర దేశాల అంతర్గత సమస్యల్లో తలదూర్చకూడదన్నది భారత విధానం. భారత అంతర్గత అంశాల్లో ఇతరుల జోక్యాన్ని సహించబోమన్నది మన నినాదం. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఇతర దేశాల భూభాగాలను వినియోగిస్తే సహించేది లేదని కూడా పలు సందర్భాల్లో తేల్చిచెప్పాం. పాకిస్థాన్ పై సర్జికల్ దాడులు కూడా ఈ దిశగానే జరిగాయని మరిచిపోకూడదు. ఇప్పుడు కెనడా ప్రభుత్వం చేసిన ఓవరాక్షన్ కు కూడా మోదీ ప్రభుత్వమూ, విదేశాంగ మంత్రి ఎస్, జయశంకర్ గట్టిగానే సమాధానమిచ్చారు. ఖలిస్తాన్ ఉద్యమకారులు కెనడా భూభాగం నుంచి చేస్తున్న రచ్చను అనేక సార్లు ప్రస్తావించి వారిని కట్టడి చేయాలని భారత ప్రభుత్వం సూచించింది. తొలుత భారత్ కు వ్యతిరేకంగా ప్రకటనలిస్తూ ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలను రేకెత్తించిన కెనడా ప్రధాని ఇప్పుడు దారికొస్తున్నారు…
ఉద్రిక్తతలు పెంచదలచుకోలేదన్న ట్రూడో
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత్ ఉందని ఆరోపిస్తూ వచ్చిన కెనడా ఇప్పుడు రూటు మార్చింది. భారత్ తో ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం ఇవ్వదలచుకోలేదని కెనడా ప్రధాని ట్రూడో స్పష్టం చేశారు. ఎప్పటిలాగే భారత్ తో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించేందుకే మొగ్గు చూపుతామని ఆయన వెల్లడించారు. భారత్ తో దౌత్య సంబంధాలు తమకెంతో ముఖ్యమని కూడా ఆయన ప్రకటించారు.
కెనడాకు షాకిచ్చిన ఇండియా…
నిజ్జార్ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని పదే పదే చెప్పినప్పటికీ కెనడా ప్రభుత్వం తన ధోరణిని మార్చుకోవడం లేదు. అవే ఆరోపణలు చేస్తోంది. దానితో భారత ప్రభుత్వం షాక్ ట్రీట్మెంట్ మొదలు పెట్టింది. భారత్ లో ప్రస్తుతం ఉన్న 62 మంది కెనడా దౌత్యాధికారుల్లో 42 మందిని స్వదేశానికి పిలిపించుకోవాలని భారత ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. దీనితో భారత్ అంటే ఏమిటో కెనడాకు తెలిసొచ్చింది. గత వారం ఏర్పడిన సమస్యల కారణంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామని కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించారు. కెనడాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఖలిస్తాన్ టెర్రరిస్టు ఆటకట్టించకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని కూడా భారత్ హెచ్చరించింది.
వీసా సేవలు నిలిపివేత
ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని భారత ప్రభుత్వం గుర్తించింది. కెనడాలోని తమ కన్సలేట్ కార్యాలయాల్లో వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఆదేశాల వెల్లడయ్యే వరకు వీసా సేవల కోసం ఎవ్వరూ రావద్దని కూడా సందేశమిచ్చింది. ఉగ్రవాదులను కట్టడి చేయడంతో కెనడా ప్రభుత్వం విఫలమైందని ప్రస్తావించినప్పటికీ ప్రధాని ట్రూడో వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవన్నది భారత ప్రభుత్వ ప్రధాన ఆరోపణ.నిజ్జార్ హత్యలో భారతీయ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు సమర్పించకుండానే కెనడా ప్రభుత్వం ఆరోపణలు సంధించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది.