అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు కొత్త వ్యూహాలను బయటకు తీస్తున్నాయి.ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేసేందుకు, వారికంటే పైచేయిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. ఆ దిశగా రాజస్థాన్ ఎన్నికల వ్యూహాల్లో ఇతర పార్టీల కంటే బీజేపీ నాలుగు అడుగులు ముందు ఉందనే చెప్పక తప్పదు. కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగడంతో ఆ వ్యూహాలకు సరైన రూపు కూడా వస్తోంది.ప్రజల పార్టీకి ప్రజల్లో మరింతగా ఆదరణ పెంచేందుకు నాయకత్వం ప్రయత్నిస్తోంది.
ప్రజల సలహాలతో మేనిఫెస్టో
రాజస్థాన్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించే దిశగా ప్రజల వద్దకే వెళ్లి వారి ఆలోచనలను తెలుసుకోవాలని బీజేపీ నిర్ణయించుకుంది. జిల్లాలో తిరుగుతూ ప్రజాస్పందనను సేకరించే ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 51 రథాలను (వాహనాలు) ప్రారంభించారు. ఈ రథాలు తమకు నిర్దేశించిన ప్రదేశాల్లో 20 రోజుల పాటు తిరుగుతాయి. పార్టీ జిల్లా కన్వీనర్ తో పాటు ఒకరిద్దరు నేతలు ఆ రథాల్లో ప్రయాణిస్తారు. ఈ క్రమంలో పార్టీ విధానాలను ప్రజలకు వివరిస్తారు. ప్రతీ రథంలో ఒక డబ్బా ఉంటుంది. రాబోయే బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో కాగితంపై రాసి ఆ డబ్బాలో పడేసే వీలుంటుంది. ఆప్నో రాజస్థాన్ సుఝావ్, సంకల్ప్ హమారా పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. రథాలు వచ్చినప్పుడు తమ సలహాలను డబ్బాల్లో వేయలేనివారి కోసం ఒక వెబ్ సైట్, ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను విశ్లేషించిన తర్వాతే మేనిఫెస్టో రూపొందిస్తారని అధిష్టానం వర్గాలు చెబుతున్నాయి.
39 మందితో తొలి జాబితా..
రాజస్థాన్ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 65 నియోజకవర్గాల అభ్యర్థులపై చర్చ జరగ్గా… అందులో 39 చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. గురువారం (అక్టోబరు 5) ప్రధాని మోదీ జోథపూర్ పర్యటన తర్వాత తొలిజాబితాను విడుదల చేస్తారని రాష్ట్ర శాఖ వర్గాలు చెబుతున్నాయి. జాబితా విషయంలో ఆశావహులందరికీ గుడ్ న్యూస్ ఉంటుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు.
గెహ్లాట్ ను ఓడించడమే లక్ష్యం
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. సర్దార్పూర్ నియోజకవర్గంలో ఆయన్ను ఓడించడమే లక్ష్యమని బీజేపీ నేతలు అంటున్నారు. అందుకే అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అక్కడ గజేంద్రసింగ్ షెకావత్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉంది. ఆయన రంగంలోకి దిగితే తటస్థులు కూడా తమకు ఓటేస్తారన్న నమ్మకం బీజేపీకి ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ ను షెకావత్ ఓడించారు.