ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమా హిట్టైందంటే సీక్వెల్స్ ప్లాన్ చేయడం కామన్ అయిపోయింది. కొన్ని ముందుగానే నిర్ణయించుకోగా మరికొన్ని సినిమాలు హిట్టైన తర్వాత సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని సీక్వెల్స్ అవసరమా అంటున్నారు సినీ ప్రియులు. అ సినిమాలేంటో చూద్దాం..
ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘స్కంద’, క్లాస్ డైరెక్టర్ తీసిన మాస్ మూవీ ‘పెదకాపు 1’, భారీ అంచనాల మధ్య వచ్చిన చంద్రముఖి 2.. ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేదు. ఈ మూవీస్ చూడడమే తలనొప్పి అనుకుంటే వీటికి సీక్వెల్స్ అవసరమా అంటున్నారు ఫ్యాన్స్..
స్కంద సీక్వెల్
స్కంద సినిమాలో బోయపాటి పారించిన రక్తం ఇప్పట్లో ఆరేలా లేదు. ఫస్ట్ షాట్ నుంచి మొదలైన ఊచకోత క్లైమాక్స్ వరకూ సాగింది. వినయవిధేయ రామలో తలలు నరికితే రాబందులు క్యాచ్ పడుతుంటాయి..ఇందులో రాబందులు లేవంతే..మిగిలినదంతా సేమ్ టు సేమ్. స్క్రీన్ మొత్తం నరుకుడే. రామ్ లుక్, శ్రీలీల డాన్స్ అదుర్స్ అనిపించినా స్కందను భరించడం కష్టమే. ఎంత లాజిక్స్ లేకుండా చూద్దామని ఫిక్సైనా బుర్ర గిర్రుల తిరిగిపోతుంటుంది. అయితే క్లైమాక్స్‌లో రామ్ డ్యూయెల్ రోల్ అని సర్ప్రైజ్ చేసి… సెకండ్ పార్ట్ ఉంటుందని ఫిక్స్ చేశాడు. దీంతో… వామ్మో ఇదే చూడలేకపోయాం..ఇంకా సీక్వెల్ అవసరమా అంటున్నారు ప్రేక్షకులు.
పెదకాపు 2
విరాట్ కర్ణను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ… పెదకాపుని ముందే రెండు భాగాలని ప్రకటించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల . ఇప్పుడు రిలీజ్ అయింది పార్ట్ వన్. ఈ సినిమా కూడా ఊరమాస్‌గా ఉంది. రా అండ్ రస్టిక్ పొలిటికల్ డ్రామా… మితిమీరిన హింసను భరిస్తే తప్ప… ఈ సినిమాను చూడలేమనే టాక్ సొంతం చేసుకుంది. ఇదే అంతంత మాత్రంగా ఉందనుకుంటే..మళ్లీ పార్ట్ 2 ఎందుకు అంటున్నారంతా..
చంద్రముఖి 3
రజనీకాంత్-జ్యోతిక ప్రధాన పాత్రల్లో పి. వాసు తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘చంద్రముఖి’ మొదటి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇది ఓ కన్నడ సినిమాకి రీమేక్ అయినా తమిళ..తెలుగు భాషల్లో సూపర్ హిట్టైంది. అదే దర్శకుడు విక్టరీ వెంకటేష్ తో ‘నాగవల్లి’ అనే సినిమా తెరకెక్కించి విమర్శలందుకున్నాడు. ఆ దెబ్బకి పదేళ్ల పాటూ చంద్రముఖి జోలికి వెళ్లలేదు. రీసెంట్ గా లారెన్స్, కంగనతో ‘చంద్రముఖి -2’ని రూపొందించాడు. ఈ ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. తిప్పితిప్పి చంద్రముఖి కథనే తీశాడనిపించింది. ఈ మూవీ ప్రచార సమయంలో చంద్రముఖి 3 ఉంటుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు చంద్రముఖి 2 చూసిన తర్వాత అవసరమా అంటున్నారంతా.
మరి ఈ సీక్వెల్స్ తీసుకోస్తారా – వెనక్కు తగ్గుతారా అన్నది చూడాలి..