మృత్యువు..ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. రకరకాల ప్రమాదాల కారణంగా రావొచ్చు, అనారోగ్యం కారణంగా చావు సంభవించవచ్చు. అయితే ఇలా అకాల మృత్యువు నుంచి బయపడేందుకు హిందూ ధర్మంలో రకరకాల పరిహారాలు చెబుతారు. వాటిలో ఒకటి తమిళనాడులో ఉన్న తిరుప్పేర్ నగర్ ఆలయంలో ఉన్న ‘ మృత్యు వినాశిని’ తీర్థం.
మార్కండేయుడు మహా శివభక్తుడు అనునిత్యం పరమశివుడిని పూజించేవాడు. ఆ స్వామి సేవలో, పంచాక్షరి నామ స్మరణలో మునిగితేలేవాడు. అలాంటి మార్కండేయుడు అల్పాయుష్కుడుగా జన్మించాడు. 16 సంవత్సరాలు నిండిన మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యముడు దున్నపోతుమీద బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తుంటాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకుని కాపాడు మహాదేవా అని ప్రార్థిస్తాడు. అప్పుడు శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి, కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. పరమ శివుడు ఆయనను ఎదిరించి మార్కండేయుడికి దీర్ఘాయువును ప్రసాదించాడు.
మృత్యువును తరిమేసే ‘ మృత్యు వినాశిని’ తీర్థం
మార్కండేయుడు మృత్వువు నుంచి బయటపడటానికి ‘ మృత్యు వినాశిని’ అనే తీర్థంలో స్నానమాచరించడం కూడా ఒక కారణమని ‘తిరుప్పేర్ నగర్’ స్థలపురాణం చెబుతోంది. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రాన్ని ‘బృహత్పురి’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ‘అప్పకుడత్తాన్’ పేరుతోనూ అమ్మవారు కమలవల్లీ తాయారు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటున్నారు. స్వామివారికి ‘అప్పాలు’ అంటే చాలా ఇష్టమట అందువల్లనే ఆయనకి ఆ పేరు వచ్చిందని అంటారు. ఇక్కడి మృత్యు వినాశిని తీర్థంలోనే మార్కండేయుడు స్నానమాచరించి దీర్ఘాయువును పొందాడని చెబుతారు. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, దీర్ఘావుయు లభిస్తుందని చెబుతారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.