లింగాయత్ వివాదం – కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త సంక్షోభం

కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఏదోక వివాదం తలెత్తుతూనే ఉంది. తొలుత పోస్టింగుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో సిద్దూ సర్కారుకు దిక్కుతోచలేదు. పైగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే డైరెక్టుగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. నియోజకవర్గం నిధుల కేటాయింపులో కొందరికి అన్యాయం జరుగుతోందంటూ పది మంది ఎమ్మెల్యేలు రాసిన లేఖ లీక్ కావడంతో మరోసారి ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. పోయిన నెల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన ఎమ్మెల్సీ బీ. హరిప్రసాద్ నేరుగా సీఎంపైనే అటాక్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ అలిగారు. ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే షమనూర్ శివశంకరప్ప .. మరో వివాదానికి తెరతీశారు.

లింగాయత్ అధికారులకు అన్యాయం జరుగుతోంది….

92 ఏళ్ల శివశంకరప్పకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటే అసలు పడదు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఆయన అఖిల భారత వీరశైవ మహాసభకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మహాసభ తరపున జరిపిన ఓ కార్యక్రమంలో సొంత ప్రభుత్వంపైనే శివశంకరప్ప దుమ్మెత్తిపోశారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన అధికారులకు అర్హతకు తగిన పోస్టింగులు ఇవ్వకుండా సిద్దరామయ్య ప్రభుత్వం పక్కనపెట్టేస్తోందని ఈ వైఖరిని సహించేది లేదని శివశంకరప్ప ప్రకటించారు. కర్ణాటకలో 17 శాతం జనాభా ఉన్న లింగాయత్ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో అందాల్సిన ప్రాతినిధ్యం అందడం లేదని శివశంకరప్ప వాదన. లింగాయత్ అధికారులు సంక్షేమ సంఘం కూడా ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వెళ్లగక్కుతోంది. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను వేరే ప్రాధాన్యం లేని పోస్టులకు మార్చేశారని, అలా 18 మంది లింగాయత్ అధికారులు బలిపశువులైపోయారని ఆ సామాజిక వర్గం లెక్కలేసి చెబుతోంది.

బీజేపీ హయాంలో పెద్ద పీట

నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ లాంటి లింగాయత్ నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తమకు అంతా మంచే జరిగిందని అధికారులకు పెద్ద పోస్టింగులు వచ్చాయని శివశంకరప్ప గుర్తు చేస్తున్నారు. నిజానికి 2008 నుంచి ఇప్పటి వరకు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు లింగాయత్స్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉండే వారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది ముఖ్యమంత్రుల్లో ఐదుగురు లింగాయత్ వర్గానికి చెందిన వారే. యడ్యూరప్ప మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. జగదీష్ షెట్టార్, బసవరాజ్ బొమ్మాయ్ కూడా లింగాయత్తులే. ప్రస్తుతం సీఎం సిద్దరామయ్య మాత్రం కురుబా సామాజిక వర్గానికి చెందిన నేత. లింగాయత్ ముఖ్యమంత్రులున్నప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారులకు మంచి పోస్టింగులు కట్టబెట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నదే శివశంకరప్ప డిమాండ్.అసలు కాంగ్రెస్ లో కూడా లింగాయత్ వర్గానికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం సమంజసమని ఆయన వాదిస్తున్నారు…

నేతల తలోమాట..

శివశంకరప్ప వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆహ్వానించారు. వీరశైవ లింగాయత్ సామాజిక వర్గం వాళ్లు ఇకనైనా మేల్కొని శివశంకరప్ప ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. లింగాయత్స్ ఆగ్రహానికి లోనై అధికారాన్ని కోల్పోయిన బీజేపీ మరో సారి ఆ పోరబాటు చేసేందుకు సిద్ధంగా లేదు. ఇక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం శివశంకరప్ప ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. కులాల ఆధారంగా పోస్టింగులు ఉండవని మెరిట్ ను బట్టి ఇస్తామని చెబుతున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 46 మంది లింగాయత్ అభ్యర్థులను బరిలోకి దించితే అందులో 37 మంది గెలిచారు. బీజేపీ తరపున 69 మంది పోటీ చేస్తే కేవలం 15 మంది విజయం సాధించారు.