సీఎం అభ్యర్థులు కాదు..సమిష్టి నాయకత్వం

మధ్యప్రదేశ్లో బీజేపీ గెలిస్తే సీఎం ఎవరు. రాజస్థాన్ లో ఆ ఇద్దరు పోటీలో ఎవరు పైచేయిగా నిలుస్తారు. ఛత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్ మరో సారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తుందా. ఇలాంటి ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనాలని బీజేపీ నిర్ణయించింది. ఏదైనా సరే పార్టీనే సుప్రీం అని తేల్చేసింది.

ఆ నాలుగు రాష్ట్రాలు…

అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో మిజోరాం మినహా మిగతా నాలుగు బీజేపీకి కీలకమే అవుతాయి. మధ్యప్రదేశ్ మినహా మిగతా మూడు చోట్ల బీజేపీ అధికారంలో లేదు. అలాగని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ సీఎం అవుతారని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. రాజస్థాన్ లో వసుంధరా రాజే తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నా… తొందరపడేందుకు పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా సీఎం అభ్యర్థి ప్రస్తావనకు రాలేదు.

మోదీతోనే విజయం సాధ్యం

ఈ సారి కూడా మోదీని ముందు పెట్టి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ డిసైడైంది. మోదీ, కమలం ఈ రెండే తమ ప్రచారాస్త్రాలవుతాయని పార్టీనేతలు తెగేసి చెబుతున్నారు. సీఎం అభ్యర్థులు ఉండరని అధికారికంగా ప్రకటించకపోయినా అందరూ అర్థం చేసుకోవాల్సిన అనివార్యత ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ (మామాజీ) బీసీ నాయకుడైనా, రాజస్థాన్ లో బీజేపిని రెండు సార్లు అధికారంలోకి తీసుకురావడంతో వసుంధర సక్సెస్ అయినా, రమణ్ సింగ్ ఛత్తీస్ గఢ్ సీఎంగా మూడు సార్లు సేవలందించినా ఇప్పుడు సీన్ మారిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు సమిష్టి నాయకత్వమొక్కడే విజయమంత్రమని తేల్చేశారు.

ఛత్తీస్ గఢ్ లో విచిత్ర పరిస్థితి..

రమణ్ సింగ్ ఛత్తీస్ గడ్ కు రాజాలా ఉండొచ్చు. గత ఎన్నికల్లో మాత్రం పార్టీ ఆయన నాయకత్వంలోనే ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ కు బీజేపీకి కనీసం పది శాతం ఓట్ల తేడా కనిపించింది. దానిపై బీజేపీ అధినాయకత్వం విశ్లేషణ జరుపుకుంది. ఓటమిలో రమణ్ సింగ్ బాధ్యత కూడా ఉందని గుర్తించింది. అందుకే ఆయన్ను ఛత్తీస్ గఢ్ నుంచి తొలగించి కొన్ని రోజులు ఆయన సేవలను కేంద్ర పార్టీలో వాడుకున్నారు. ఇక మోదీ తన ప్రసంగాల్లో సైతం ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లు ఎక్కడా ప్రకటించడం లేదు. తెలంగాణ విషయంలో కూడా అదే ధోరణిని పాటిస్తున్నారు. శివరాజ్, వసుంధర మాటే రావడం లేదు. ఒకటి రెండు సార్లు రమణ్ సింగ్ ను ప్రశంసించారంతే.

ఎందుకు గెలవలేదు..

రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో ఎందుకు గెలవలేదు. మధ్యప్రదేశ్లో మరో దారి చూసుకుని అధికారంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది లాంటి ప్రశ్నలపై పూర్తి స్థాయి విశ్లేషణ జరిగినప్పుడు ప్రాంతీయ నాయకుల తీరు పట్ల బాగానే అసంతృప్తి వ్యక్తమైంది. వారిని మార్చాల్సిన అనివార్యత కనిపిస్తోందని అధిష్టానం గుర్తించింది. అలాగని ఇప్పుడే ప్రకటిస్తే అది ఎన్నికల్లో నెగిటివ్ పాయింట్ అయి కూర్చుంటుందని లెక్కలేసుకున్నారు. అందుకే ప్రస్తుతానికి మౌనం వహిస్తే.. ఫలితాలు తర్వాత చూసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతానికి మోదీ మాత్రమే స్టార్ క్యాంపైనర్..