చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత ఆయన ఎప్పుడు బయటకు వస్తారో ఎవరికీ అర్థం కావడంలేదు మరో వైపు లోకేష్ ఢిల్లీ నుంచి రావడం లేదు. సుప్రీంకోర్టులో తీర్పు లేకపోకపోవడంతో తాను ఢిల్లీలోనే ఉంటానని ఆయన చెబుతున్నారు దీంతో ఏపీలో టీడీపీకి నాయకత్వం కొరత ఏర్పడింది. కానీ రాజమండ్రిలోనే ఉంటున్న నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి ఆ బాధ్యతలు తీసుకున్నారు. నారా బ్రాహ్మణి ఆ బాధ్యతల్ని తీసుకోవడానికి మరింత ఆసక్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై నేరుగా రాజకీయ విమర్శలు చేస్తున్నారు.
రాజకీయం ప్రారంభిచిన నారా బ్రాహ్మణి
ఎన్టీఆర్ మనవరాలు, బాలకృష్ణ కుమార్తె. చంద్రబాబునాయుడుకోడలు, నారా లోకేష్ భార్య ఇలా చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న నారా బ్రాహ్మణి ఇప్పటి వరకూ హెరిటేజ్ కంపెనీ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. కానీ గత నెల రోజులుగా టీడీపీ కోసమే పని చేస్తున్నారు. చంద్రబాబు విడుదల ఆలస్యం కావడంతో రాజకీయం కూడా ప్రారంభించారు. ఏపీ నుంచి పెట్టుబడులు తరలి పోవడంపై ఓ ఇంగ్లిష్ వెబ్ సైట్ లో వచ్చిన వార్తను షేర్ చేసి.. సీఎం జగన్ పాలన వేరే రాష్ట్రాలను అభివృద్ధి చేసేలా ఉందని విమర్శించారు. అంతకు ముందు అంగన్ వాడీ మహిళల సమస్యలపైనా స్పందించారు. నారా బ్రాహ్మణిని రాజకీయంగా తెరపైకి తెస్తున్నారని ఈ పరిణామాలతో స్పష్టమవుతుంది.
ధైర్యంగా మీడియాకు సమాధానాలు
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాజమండ్రిలో నిర్వహించిన ర్యాలీలో బ్రహ్మణి పాల్గొన్నారు. అప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారు. కొన్ని రోజులు రాజకీయ సభల్లో పాల్గొంటే ఆమె మరింత రాటుదేలుతారని.. నందమూరి వారసురాలిగా ఆమె రాక పార్టీని మరో మెట్టు ఎక్కిస్తుందని వారంతా ఆశిస్తున్నారు. అయితే బ్రహ్మణి రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఆ సంకేతాలు ఇవ్వలేదు. కానీ నారా బ్రాహ్మణి టీడీపీ తరపున యాక్టివ్‌గా రాజకీయాలు చేయాలని క్యాడర్ నుంచి డిమాండ్ పెరుగుతోంది.
లోకేష్ ను అరెస్టు చేస్తే తప్పదా.. ?
చంద్రబాబు తర్వాత లోకేష్ నూ అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇన్నర్ రింగు రోడ్డు కేసులో లోకేష్ ను నిందితుడిగా చేర్చడంతో అది ఖాయం అయిపోయింది కూడా. మరి లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే.. ప్రజల్లోకి వెళ్లేది ఎవరు అనే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి మాటలతో కాకుండా చేతలతో రాజకీయాలు ప్రారంభించేశారు. టీడీపీ త్వరలో మహిళా నాయకత్వం చేతుల్లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.