మధ్యప్రదేశ్ బీజేపీ ప్రచారానికి యూపీ, గుజరాత్ నేతలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.అక్కడ మరోసారి విజయాన్ని సొంతం చేసుకునేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. మధ్యప్రదేశ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల నేతలను కూడా రంగంలోకి దించింది. వచ్చే రెండు నెలల పాటు అక్కడే ఉండి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించింది.

మూడు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు

తెలంగాణ ఎన్నికల కోసం ఇతర దేశాల నుంచి బీజేపీ ప్రచార సారథులను పంపాలని తీర్మానించిన టైమ్ లోనే మధ్యప్రదేశ్ పై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు కొందరు కేంద్ర మంత్రులతో పాటు సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డిలను అధిష్టానం నియమించింది. అదే క్రమంలో మధ్యప్రదేశ్ ప్రచారం కోసం ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి భారీగా బీజేపీ శ్రేణులు రంగంలోకి దిగనున్నాయి. ఉత్తర ప్రదేశ్ కు చెందిన 15 మంది కీలక నేతలకు మధ్యప్రదేశ్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

రంగులోకి యూపీ డిప్యూటీ సీఎం

ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ మరో రెండు నెలల పాటు తన సొంత రాష్ట్రంలో ఉండటం లేదు. ఆయన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో మకాం చేసి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తారు. సీనియర్ మంత్రులు స్వతంత్రా దేవ్ సింగ్ ను సాత్నా జిల్లాకు, బేబీ రాణి మౌర్యాను గ్వాలియర్ జిల్లాకు, దినేష్ ప్రతాప్ సింగ్ ను రైసేన్ జిల్లాకు, దయా శంకర్ మిశ్రా దాటియా జిల్లాకు, కపిల్ దేవ్ అగర్వాల్ దామోహ్ జిల్లాకు ప్రచార పర్వవేక్షకులుగా నియమితులయ్యారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ ప్రస్తుతం నోయిడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మధ్యప్రదేశ్ లోని విదిషా జిల్లా ఎన్నికల ఇంఛార్జ్ గా ఉంటారు. ఇందులో స్వతంత్రా దేవీ సింగ్ ను ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. గత లోక్ సభ ఎన్నికల్లో గుణా నియోజకవర్గంలో జ్యోతిరాదిత్య సింథియాను ఓడించడం వెనుక ఆయన కీలక బాధ్యత వహించారు. సింథియా తర్వాత బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు..

మోదీ ప్రారంభించిన ప్రచార వ్యూహం

ఈ ఏడాది జూన్ నుంచే ప్రధాని మోదీ నేతృత్వంలో మధ్యప్రదేశ్ ప్రచార వ్యూహం ఊపందుకుంది. జూన్ నెలలో దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 3 వేల మంది బూత్ లెవెల్ వర్కర్లను భోపాల్ పిలిపించి ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో వారికి దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్కరిని ఒక్కో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల పరిధికి పంపి అక్కడి స్థానిక బీజేపీ కార్యకర్తలతో కలిపి పనిచేయిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వాళ్లు పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మూడు రాష్ట్రాల నుంచి 57 మంది ప్రజా ప్రతినిధులను మధ్యప్రదేశ్ కదనరంగంలోకి దింపారు. పార్టీ విజయావకాశాలను మరింతగా మెరుగు పరిచేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.