కాంగ్రెస్, ఆప్ ఒక పెళ్లి వేడుక…

ఇండియా గ్రూపును ఏ ముహుర్తాన పెట్టారో గానీ కీచులాటలు మాత్రం ఓ రేంజ్ దాటిపోయాయి. ఒకరిని ఒకరు దెబ్బతీసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుని అరెస్టుల దాకా వెళ్లిపోయాయి.

పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. చండీగఢ్‌లోని ఖైరా నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జలాలాబాద్, ఫజిల్కాలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద 2015లో నమోదైన పాత కేసుకు సంబంధించి పోలీసులు ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాకు మద్దతు ఇవ్వడం, వారికి ఆశ్రయం కల్పించడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం వంటి ప్రాథమిక ఆరోపణలు ఖైరాపై ఉన్నాయి. దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ ప్రకారం.. వచ్చిన నిధులను ఖైరా ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2014-2020 మధ్య ఎన్నికల సమయలో ఖైరా ప్రకటించిన ఆదాయానికి మించి కుటుంబసభ్యులకు రూ.6.5 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు నివేదికలున్నాయి. అరెస్టు సమయంలో ఖైరా పెట్టిన ఫేస్ బుక్ లైవ్ కూడా ఇప్పుడు ఉత్తరాదిన చర్చనీయాంశమైంది.

నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఐక్యత

నిజానికి పంజాబ్లోని ఆప్ ప్రభుత్వానికి, అక్కడి కాంగ్రెస్ యూనిట్ కు మధ్య చాలా రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఖైరా అరెస్టుతో ఇప్పుడది జాతీయ స్థాయిలో రెండు పార్టీల మధ్య విభేదాలకు, వివాదాలకు దారి తీసే అవకాశమూ ఉంది. అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తన వద్ద లేవని అంటూనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆప్ కు గట్టి వార్నింగే ఇచ్చారు. అన్యాయాన్ని సహించేది లేదని అంటూ అన్యాయానికి దిగిన వాళ్లు ఎక్కువకాలం మనుగడ సాధించలేరని హెచ్చరించారు. దీనితో ఇండియా కూటమి లో ఐక్యత నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆప్ అయిష్టంగా కూటమిలో కొనసాగుతోందన్న కొందరు వాదిస్తున్నారు..

రాఘవ్, పరిణితి వివాహ వివాదం

ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం ఇటీవల బాలీవుడ్ స్టార్ మహిళ పరిణితి చోప్రాతో ఘనంగా జరిగింది. ఉదయ్ పూర్ కోటలో నిర్వహించిన ఈ పెళ్లికి కోట్లు ఖర్చుపెట్టడంపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శలు సంధించాయి. ఆమ్ ఆద్మీ అని చెప్పుకుంటూ పెళ్లికి అంత ఖర్చుపెట్టడమేమిటీ, అలాంటి ఆడంబరాలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరు కావడమేంటని కాంగ్రెస్ నిలదీసింది. అలా ప్రశ్నించిన వారిలో పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖైరా కూడా ఉన్నారు. నిలదీసినందుకే తనను పాతకేసులో అరెస్టు చేశారని ఖైరా అంటున్నారు. నిజమో కాదో భగవంత్ మానే చెప్పాలి.