తెలంగాణలో ప్రధాని సహా అగ్రనేతల వరుస పర్యటనలు – ఎన్నికలకు రెడీ !

తెలంగాణ బీజేపీ గేర్ మార్చింది. వరుసగా అగ్రనేతలు పర్యటించబోతున్నారు. అగ్రనేతలు తెలంగాణ బాట పడుతూ ఎప్పటికప్పుడు కాషాయ పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్ లో పర్యటించారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా.. నేతలతో భేటీ అయి ఎన్నికల కార్యచరణపై చర్చించారు. అంతేకాకుండా.. అధిష్టానం సూచనలను తప్పక పాటించాలని.. ఐకమత్యంతో ముందుకెళ్లాలని.. ఇకపై అగ్రనేతలంతా ఎప్పటికప్పుడు తెలంగాణలో పర్యటిస్తారని కూడా హామీనిచ్చారు.

వరుసగా రెండు సార్లు మోదీ పర్టన

బీజేపీ వ్యూహంలో భాగంగా అగ్రనేతలంతా తెలంగాణకు క్యూకట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబరు 1న మహబూబ్‌నగర్ వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపడంతోపాటు.. ఎన్నికలకు సిద్ధమయ్యేలా పలు సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి ఇప్పటికే టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. మహబూబ్‌నగర్‌ పట్టణ శివార్లలోని భూత్‌పూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మోడీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది.

కీలక సూచనలు చేయనున్న మోదీ

ప్రధాని మోడీ సభ ఎన్నికలకు ముందు కీలకం కానుంది. ఓ వైపు సభతో పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయడం.. మరోవైపు నేతలకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్‌గా ప్రధాని మోదీ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోదీ సభ తర్వాత బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం వెల్లడించే ఛాన్స్ ఉంది. ప్రధాని మోడీతోపాటు.. బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు.

అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో బహిరంగసభలు

మోడీ సభ అనంతరం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో, 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. . అగ్రనేతలు విస్తృతంగా పర్యటించనున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు వచ్చి.. బీజేపీ ఆవశ్యకతను వివరించనున్నారు. బీజేపీ ప్రచార ప్లాన్ ప్రణాళికాబద్దంగా ఉంటుంది. మీడియాలో హడావుడి కన్నా.. ఓటర్లను నేరుగా కలవడానికే ప్రాధాన్యం ఇస్తుంది.