వైసీపీ అధినేత సీఎం జగన్ రెడ్డి బంధువు, ఒంగోలు కీలక నేత , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి వైసీపీలో రోజు రోజుకు దిగజారిపోతోంది. ఆయనకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారు. పదే పదే అవమానిస్తున్నారు. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. బాలినేనని వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారు.
కనీస సమాచారం లేకుండా బాలినేని అనుచరుల గెంటివేత
బాలినేని కి జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. తాజాగా ఆయన అనుచరులు ఇద్దర్ని పార్టీ నుంచి గెంటేశారు. బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరి్సతూ ఉంటారు. బాలినేనికి సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన పార్టీ నేతలపై మండిపడ్డారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బాలినేని హెచ్చరికల్ని పట్టించుకోని హైకమాండ్
అయితే బాలినేని హెచ్చరికల్ని హైకమాండ్ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఈ అంశంపై బాలినేని చర్చించే అవకాశం ఉందని చెపుతున్నారు. అయితే ముఖ్యమంత్రికి తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని.. అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాపై బాలినేని ప్రభావం ఏమీ ఉండదని చెప్పేందుకు ఈ సంకేతాలు పంపారని అంటున్నారు. ఈ కారణంగా బాలినేనిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయనకు గేటు చూపించారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
విజయసాయిరెడ్డి చెప్పింది అబద్దమేనా ?
కోస్తా జిల్లాల ఇంచార్జ్ గా విజయసాయిరెడ్డి నియమితులు కావడంతో ఆయన సమీక్షలు ప్రారంభించారు. ఒంగోలు వెళ్లి పార్టీ నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బాలినేని కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుందని ప్రకటించారు. కానీ బాలినేని రాజకీయ ప్రత్యర్థి అయిన వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ కు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అక్కడ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. ఇప్పుడు మాగుంట, బాలినేని ఒక్కటయ్యారు. ఇద్దరమూ పోటీ చేస్తామని బాలినేని చెబుతున్నారు. దీంతో వైసీపీలో చిచ్చు ముదిరి పాకాన పడుతున్నట్లుగా అయింది. బాలినేని, విజయసాయిరెడ్డి, మాగుంట ఒక గ్రూప్ అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి.. వారికి వ్యతిరేకమయ్యారు. కానీ ఆయనదే పైచేయి అవుతోంది.