దేశంలో ఎవరినీ కదిలించినా ఐదు రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా.. జమిలీ ఎన్నికలు వస్తాయా. జమిలీలో భాగంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారా. రాజకీయ పార్టీలు కూడా అదే దిశగా ఆలోచిస్తూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ మొదటి నుంచి కూడా వన్ నేషన్…వన్ పోల్ కు అనుకూలమన్న వాదన నడుమ ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి.
తర్వలో లా కమిషన్ నివేదిక
జమిలీ ఎన్నికలపై త్వరలోనే లా కమిషన్ నివేదిక కేంద్రానికి అందే అవకాశం ఉంది. దేశ 22వ లా కమిషన్ తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా సమాచారం వస్తోంది. 2024తో పాటు 2029కి జమిలీ ఎన్నికలు నిర్వహించే విధంగా టెంటెటివ్ షెడ్యూల్ ను లా కమిషన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ దిశగా చూస్తే నివేదిక అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నందున 2024లో జమిలీ కుదరకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. 22వ లా కమిషన్ పదవీ కాలం 2024 ఆగస్టు 31 వరకు ఉన్నందున మరికొన్ని సిఫార్సులు కూడా చేసే అవకాశం ఉంది. 2029 నాటికి ఒక సమగ్ర ఎన్నికల ప్రక్రియ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రామ్ నాథ్ కొవింద్ ప్యానెల్
జమిలీ ఎన్నికలపై చర్చించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వం అందులో నిష్ణాతులను నియమించింది.కమిటీ తన తొలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వన్ నేషన్ – వన్ పోల్ పై ప్రధాని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుని తర్వాత ముందుకు సాగాలని తీర్మానించుకుంది. అక్టోబరులో మలి సమావేశం నిర్వహించే నాటికి లా కమిషన్ సలహాలు కూడా పొందాలని రామ్ నాథ్ కొవింద్ ప్యానెల్ నిర్ణయించుకుంది. ఈ అంశంపై కేంద్ర న్యాయ శాఖకు సమాచారం కూడా అందించింది.
జనాభిప్రాయం ముఖ్యమంటున్న ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం కమిషన్, కమిటీ నివేదికలతో పాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రక్రియ కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది. స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఓ సమగ్ర కార్యాచరణకు అవకాశం ఉంటుందని చెబుతోంది. పార్లమెంటు నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు జమిలీలో భాగం చేయాలంటే అదెంతో వ్యయ,ప్రయాసలతో కూడుకున్న అంశమని దానికి ప్రజాభిప్రాయం చాలా ముఖ్యమని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అంత మేర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునే సమర్థత కూడా దేశానికి ఉందా లేదా అన్నది రామ్ నాథ్ కొవింద్ ప్యానెల్ నిర్థారించాలి. ఆ పని జరిగితే జమిలీ దిశగా అడుగులు వేయడం కష్టమేమీ కాదు.