సాధారణంగా వారానికోసారి తలస్నానం చేస్తుంటారు. దుమ్ము-ధూళి మధ్య తిరిగేవారు తరచూ చేస్తుంటారు. అయితే తలకు మామూలుగా స్నానం ఎప్పుడైనా చేయొచ్చు కానీ తలరుద్దుకోవడం కొన్ని రోజుల్లో మంచిది కాదంటారు పండితులు. వీటిలో ప్రత్యేకంగా పురుషులకు, స్త్రీలకు వేరు వేరు నియమాలు-ఫలితాలు ఉన్నాయి.
సాధారణంగా శుక్రవారం, శనివారం తలస్నానం చేయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆడపిల్లని మహాలక్ష్మీ స్వరూపంగా భావించి శుక్రవారం మంచిందంటారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం అస్సలు తలంటు పోసుకోరాదు.
స్త్రీలు ఏ రోజు తలంటుపోసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది
సోమవారం తలంటు పోసుకుంటే నిత్య సౌభాగ్యం పెరుగుతుంది. మంగళవారం ఎట్టిపరిస్థితుల్లోనూ తలరుద్దుకోరాదని చెబుతున్నాయి ధర్మ శాస్త్రాలు. బుధవారం తల స్నానం చేస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. గురువారం, శుక్రవారం కూడా తలస్నానం చేయకూడదట. శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది
పురుషులు ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం
పురుషులు సోమవారం తలంటు పోసుకుంటే అందం పెరుగుతుంది. మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుంది. బుధవారం తల స్నానంతో లక్ష్మీదేవి దీవెనలుంటాయని చెబుతారు. గురువారం తలంటు పోసుకుంటే ఆర్ధిక నష్టాలు పెరుగుతాయి . శుక్రవారం తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి. శనివారం తల స్నానం చేస్తే పురుషులకు మహా భోగం కలుగుతుంది. ఇక ఆదివారం తలంటు పోసుకుంటే కోరికలు పెరుగుతాయి
ఈ సందర్భాల్లో ఎప్పుడైనా తలంటు పోసుకోవచ్చు
అయితే పండుగలు, నోములు, పూజలతో పాటూ స్త్రీలకు నెలసరి సమయంలోనూ ఏ రోజైనా తలరుద్దుకోవచ్చు. కొందరు మంగళవారం, శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజ చేసుకుని ఒక్కపూట భోజనం చేస్తుంటారు. అలాంటి వారు ఆ రోజుల్లో ఉదయం తలంటుపోసుకుని పూజచేస్తారు….అయితే అప్పుడు కూడా తలకు స్నానం సరిపోతుంది తలంటు ( షాంపు, కుంకుడు కాయ పెట్టడం) అవసరం లేదంటారు పండితులు. మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని, నలుగు పెట్టుకుని చేయాలి. తలస్నానం చేసిన రోజున ఎవరైనా ముత్తైదువు ఇంటికి వస్తే బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు ఇస్తే మంచి జరుగుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.