యనమల త్యాగం చేయక తప్పదా ? తుని సీటు జనసేనకు కేటాయిస్తారా ?

తుని.. ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట. రెండు దశాబ్దాలకు పైనే పసుపు జెండా ఎగిరిన చోటు. అలాంటి నియోజకవర్గం.. ఇప్పుడు వైసీపీ కంచుకోటగా మారింది. వరుసగా గెలిచిన యనమల ఇప్పుడు పోటీ చేయడానికి రెడీగా లేరు. ఆయనకు బదులుగా సోదరుడు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కుమార్తెను రంగంలోకి దింపుతున్నారు. కానీ జనసేనతో పొత్తులో చివరికి సీటును త్యాగం చేయాల్సి వస్తుందన్న చర్చ జరుగుతోంది.

తునిలో వరుసగా ఆరు సార్లు గెలిచిన టీడీపీ

తునిలో వరుసగా ఆరు సార్లు గెలిచి.. డబుల్ హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ. 2009 ఎన్నికల్లో.. టీడీపీ కంచుకోట బద్దలైంది. అప్పుడు.. కాంగ్రెస్ అభ్యర్థి రాజా అశోక్ బాబు గెలిచారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం హవా కనిపించడంతో.. తునిపై మళ్లీ టీడీపీ పట్టు సాధిస్తుందనుకున్నారు. కానీ.. అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభంజనంలో.. తునిలో వరుసగా రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో.. కాపు సామాజికవర్గం ఓట్లు 50 వేల దాకా ఉన్నాయి. అలాగే.. యాదవుల ఓట్లు సుమారుగా 30 వేలు, వెలమల ఓట్లు 30 వేలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లు 45 వేల దాకా ఉన్నాయి. వీళ్లే.. పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తారు.

ప్రజలకు దూరమైన యనమల కుటుంబం

తుని నుంచి వరుసగా ఆరు సార్లు విజయం సాధించి యనమల చరిత్ర సృష్టించారు. తొలిసారి 2009 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు ఓడిపోయారు. దాంతో.. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తర్వాత.. తన రాజకీయ వారసుడిగా తమ్ముడు యనమల కృష్ణుడిని బరిలోకి దించారు. 2014, 2019 ఎన్నికల్లోనూ.. కృష్ణుడు ఓటమిపాలయ్యారు. యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను.. తుని టీడీపీ ఇంచార్జ్‌గా పాలిటిక్స్‌లోకి దించారు. అప్పట్నుంచి.. ఆవిడ జనంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే.. చివరి నిమిషంలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో తెలియదు కాబట్టి.. యనమల కృష్ణుడు ఇంకా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ తనకు టికెట్ రాకపోయినా.. అన్న కూతురు దివ్యకు మద్దతుగా ఉంటానని చెబుతున్నారు.

కాపుల ఓట్లు ఎక్కువ – జనసేన కు కేటాయిస్తారా ?

తునిలో కాపు సామాజికవర్గం ఎక్కువ. పీఆర్పీ పోటీ చేసినప్పుడు ముఫ్పై వేలకుపైగా ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే ఆరేడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు జనసేన నేతగా ఉన్నారు. తునిలో ఆఖరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజ అశోక్ బాబుకి సొంతంగా క్యాడర్ ఉన్నా.. పాలిటిక్స్‌కి మాత్రం దూరంగా ఉంటున్నారు. దాంతో.. ప్రస్తుతం నియోజకవర్గంలో జనసేనకు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉన్నా.. నడిపించే నాయకుడే లేడన్న వాదన వినిపిస్తోంది. అయినా టీడీపీ మద్దతుతో … కాపుల ఓట్లు ఏకపక్షంగా పడతాయన్న అంచనాతో… జనసేన ఈ సీటు కోసం టీడీపీపై ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.