ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఎవరికీ కనిపించని వారు కొందరు ఉంటారు. అలాంటి వారిలో గుమ్మనూరు జయరాం ఒకరు. ఎప్పుడైనా తన శాఖపై సమీక్ష చేసినట్లుగా ఎవరికీ తెలియదు. పోనీ రాజకీయంగా ఏమైనా హడావుడి చేస్తారా అంటే అదీ లేదు. అందుకే ఇప్పుడు ఆయన టిక్కెట్ పై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
వివాదాలకు కొదవలేని మంత్రి జయరాం
కర్నూలు జిల్లా ఆలూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న జయరాం అమాత్యునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన స్వగ్రామంలో మంత్రి సోదరులు పేకాట క్లబ్‌లు, నాటు సారా స్థావరాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సెబ్ అధికారులు దాడులు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయినా బీసీ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో జగన్ కేబినెట్‌లో రెండో సారి అమాత్యునిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో సొంత సెగ్మెంట్‌లోనే మంత్రి జయరాంకు కష్టాలు ఎదురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆలూరు నుంచి ఫ్యాక్షన్ నేత బొజ్జమ్మకు వైసీపీ నుంచి టిక్కెట్ దక్కే చా్స్
ఆలూరులో బీసీల ప్రాబల్యం అధికంగా ఉన్నారు. అయితే టీడీపీ తరపున కోట్ల సూజాతమ్మ పోటీ చేస్తారు. దీంతో మరో మహిళా బీసీ నేతకు టికెట్ కేటాయించాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. బీసీ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దివంగత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ వైసీపీలో చేరారు. బొజ్జమ్మను ఆలూరులో పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే బొజ్జమ్మ చేరిక మంత్రి జయరాం వర్గానికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నేరుగా బొజ్జమ్మతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేర్చుకోవడంతో జయరాం ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో బొజ్జమ్మ ఆలూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ వైసీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్నారు . దీంతో ఆమెకే టిక్కెట్ అనిప్రచారం జరుగుతోంది.
జయరాంకు ఎంపీ టిక్కెట్ ఇస్తామంటున్న హైకమాండ్
ఆలూరు వైసీపీ టికెట్ తమదేనంటూ బొజ్జమ్మ వర్గీయులు హల్‌చల్ చేస్తున్నారు. మరోవైపు కోట్ల సుజాతమ్మకు దీటుగా రెడ్డి సామాజిక వర్గం నేతలను వైసీపీ ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కోసం కష్ట పడి ఎలాంటి పదవి దక్కక తీవ్ర అసంతృప్తిలో ఉన్న వైసీపీ రాష్ట్ర నాయకులు తెరనేకల్ సురేందర్ రెడ్డి ఆలూరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆలూరు మాజీ ఎమ్మెల్యే దివంగత నీరజారెడ్డి కుమార్తె , ఎన్నారై హిమవర్ష రెడ్డి కూడా ఆలూరు టికెట్‌ను ఆశిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆలూరు టికెట్ జయరాం కుటుంబానికి ఇవ్వకపోతే జడ్పీటీసీ విరుపాక్షికా, బొజ్జమ్మకా..లేక రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తారా అన్నది నియోజకవర్గంలో చర్చ నీయాంశంగా మారింది.