వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ డీప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు సీటు లేనట్లేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మాన పదవిని తప్పించి… తమ్ముడు ధర్మాన ప్రసాదరావుకు పదవి ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా .. చేస్తే టిక్కెట్ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది.
ధర్మాన ప్రసాద్ అండతోనే రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణదాస్
శ్రీకాకుళం జిల్లాలో గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు సోదరుడిగా ధర్మాన కృష్ణదాస్ రాజకీయాల్లోకి వచ్చారు. 2004 ముందు వరకు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేసేవారు. 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసి నరసన్నపేట నుంచి తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణదాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లోనూ విజయం సాధించారు. తర్వాత వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలోనూ నరసన్నపేట నుంచి వైఎఎస్సార్సీపీ తరఫున గెలుపు అందిపుచ్చుకున్నారు. అయితే 2014లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ధర్మాన కృష్ణదాస్.. జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి కేబినెట్ విస్తరణలో ధర్మాన కృష్ణదాస్ పదవి ఊడింది.
జిల్లా అధ్యక్షుడిగా ఆయన మాట ఎవరూ వినడం లేదు !
ఆయనను శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా జగన్ నియమించారు. అయితే ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసన్నపేటలో సొంత పార్టీలోనే ఆయనకు అసమ్మతి పోరు ప్రారంభమయింది. వంశధార నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు, భూదందాలు చేసేవారిని కృష్ణదాస్ చేరదీస్తున్నారని అసమ్మతి వర్గం ఆరోపిస్తుందని చెబుతున్నారు. అందులోనూ మొదటి నుంచి ధర్మానతో ఉన్నవారిని కాకుండా కొత్తవారిని చేరదీస్తున్నారని.. వారి అక్రమాలకు, అవినీతి పనులకు ధర్మాన కృష్ణదాస్ అండగా ఉంటున్నారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక దందా వెనక కృష్ణదాస్ పెద్ద కుమారుడు రామలింగం నాయుడు, అతని భార్య ఉన్నారని అసమ్మతి వర్గం విమర్శలు చేస్తోంది.
కుటుంబంలోనూ వివాదాలు
ముఖ్యంగా ధర్మాన కుటుంబ సభ్యుల పాత్ర గురించి రకరకాల అంశాలు సోషల్ మీడియాలో.. పార్టీ వర్గాల్లో చర్చగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ కు టికెట్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఈ దిశగా సీఎం వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఈ అవినీతి, గ్రూపు తగాదాలతోనే ధర్మానను జగన్ కేబినెట్ నుంచి తొలగించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని.. అసెంబ్లీ టికెట్ మాత్రం ఆశించవద్దని కృష్ణదాస్ కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.