మారుతున్న రాజకీయం – ఎన్జీయేలోకి జేడీఎస్

రాజకీయం మారుతోంది. ప్రధాని మోదీ నాయకత్వానికి వరుసగా పార్టీలు జై కొడుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్రపడిన తర్వాత బీజేపీ నాయకత్వానికి విశ్వసనీయత మరింతగా పెరిగింది. మోదీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం పార్టీల నేతలు క్యూ కడుతున్నారు.

కాంగ్రెస్ కు దూరం బీజేపీకి దగ్గర..

కర్ణాటకలోని జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) ఒకప్పుడు కాంగ్రెస్ కు సన్నిహిత పార్టీగా చెప్పుకున్నారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికలతో తండ్రీకొడుకులు దేవెగౌడ, కుమారస్వామి రూటు మార్చుకున్నారు. జేడీఎస్ విడిగా పోటీ చేసి అతి తక్కువ సీట్లలో గెలిచిన మాట వాస్తవం పైగా తమకు పడని సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా మరోసారి రావడంతో ఇక కాంగ్రెస్ వైపుకు వెళ్లే ప్రసక్తేలేదని కుమారస్వామి తేల్చేశారు. ఇప్పుడు ఎన్డీయే వైపుకు వస్తున్నట్లు ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరడంలో బీజేపీకి చెందిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రధాన భూమిక పోషించారు.

మరో రెండు దఫా చర్చలు

2024 లోక్ సభ ఎన్నికల్లో విజయమే ప్రతిపాదికగా పార్టీలు కలుస్తున్నాయి. కన్నడ నాట 28 లోక్ సభా స్థానాలంటే అందులో నాలుగు జేడీఎస్ కు కేటాయించేందుకు బీజేపీ అంగీకరించింది. మరో స్థానం మాండ్యాపై పీటముడి పడింది. అది సుమలత సీటు అని బీజేపీ వాదిస్తోంది. మరో రెండు దఫాల చర్చలు పూర్తయితే సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

కావేరి జల వివాదం కూడా….

జేడీఎస్..ఇండియా కూటమిలో చేరలేదు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. కర్ణాటక కాంగ్రెస్ నేతలు కూడా పార్టీతో స్నేహాన్ని వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. అప్పటికే బీజేపీ, జేడీఎస్ మధ్య చర్చల ప్రక్రియ మొదలైంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు కూడా జేడీఎస్ ను దూరం పెట్టాలనే వాదించారని తెలిసింది. ఇప్పుడు మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇండియా గ్రూపులోకి జెడీఎస్ వెళ్లకపోవడానికి శతాబ్దాలుగా తెగని కావేరీ జల వివాదం కూడా ఒక కారణమని తేల్చారు. తమిళనాడులో అధికారానికి వచ్చిన డీఎంకే … తమ రాష్ట్రం దిగువ పరీవాహక ప్రాంతమైనందున తక్షణమే నీరు విడుదల చేయాలని కోరుతున్నారు. కర్ణాటక రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే ఎలాంటి చర్యను చేపట్టకూడదని కుమారస్వామి వాదిస్తున్నారు. ఇండియా గ్రూప్ లో కాంగ్రెస్ పార్టీకి డీఎంకేతో అవసరాలున్నందున తమిళనాడు వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని కుమారస్వామి ఆరోపణ. అయితే కావేరీ జల వివాదం చాలా సున్నితమైన మనోభావాలతో కూడుకున్న అంశం. కేవలం నదీజలాలు, ఆర్థిక అంశాలుగా మాత్రమే దాన్ని పరిగణించకూడదు.