ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాల్లో భారీ స్కాం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఆమె… క్షేత్ర స్థాయికి వెళ్తున్నారు. నర్సాపురంలో ఓ మద్యం దుకాణానికి వెళ్లి ఆరా తీస్తే.. లక్ష రూపాయల మద్యం అమ్మకానికి ఏడు వందల రూపాయలకే బిల్లులు కనిపించాయి. దీంతో పాటు అది కల్తీ మద్యం అని.. దాని వల్ల చాలా మంది అనారోగ్యం పాలయ్యారని ఆస్పత్రికి కూడా వెళ్లి పరామర్శించారు.
పురందేశ్వరి పోరాటానికి సోషల్ మీడియాలో మంచి స్పందన
మద్యం విషయంలో ఏపీ ప్రజల్లో అసంతృప్తి ఉంది. తమ కుటుంబాల్లో మద్యం అలవాటు ఉన్న వారు ఉంటే ఆ నరకం ఎలా ఉంటుందో ఆకుటుంబాలకు తెలుసు. ఆదాయం మొత్తం మద్యానికి ఖర్చు పెట్టేస్తూంటారు. ఇలాంటి అసంతృప్తికి తోడు .. క్వాలిటీ లేని మద్యం. దేశంలో మరెక్కడా అమ్మకూడదని మద్యం అమ్ముతున్నారు. అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రజల్లో ఈ ఆగ్రహం ఉండటంతో పురందేశ్వరి చేసి న పోరాటానికి మంచి స్పందన లభించింది. కానీ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదన్న అసంతృప్తి క్యాడర్ లో కనిపిస్తోంది.
పురందేశ్వరి ఒక్కరే హైలెట్ అయ్యేలా కార్యక్రమాలు
పురందేశ్వరి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి పార్టీకి పూర్తిగా కార్యక్రమాలను ఎసైన్ చేయడం లేదు. ఆమె వ్యక్తిగతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మద్యం స్కాం అనేది రాష్ట్రం మొత్తం జరుగుతున్నప్పుడు పార్టీలోని అన్ని వ్యవస్థలను ఇంక్లూడ్ చేసి.. ఒక్క సారే పోరాటం చేస్తే బీజేపీకి మంచి మైలేజీ వచ్చిది కదా అని చాలా మంది బీజేపీ నేతల వాదన . ఇప్పుడు పురందేశ్వరి మద్యం బాటిళ్లు పగలగొడుతున్న వీడియోలు.. లెక్కలు అడుగుతున్న వీడియోలు… వైరల్ అవడం వల్ల ఆమెకు పేరు వస్తోంది కానీ..బీజేపీ కార్యక్రమం అనే భావన కలగదని అంటున్నారు.
కలసికట్టుగా కార్యక్రమాలు చేపడితే బీజేపీ బలోపేతం
నాయకుడు అంటే తాను నడివడమే కాదు నడిపించాలని అంటూ ఉంటారు. అధ్యక్షురాలు తాను క్షేత్ర స్థాయికి వెళ్లినా వెళ్లకపోయినా పార్టీ క్యాడర్ మొత్తాన్ని కదిలించేలా ఉండాలని కోరుకుంటారు . అయితే పురందేశ్వరి తాను ఉద్యమం చేస్తున్నారు కానీ పార్టీని కదిలించే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. అందర్నీ కలుపుకుని .. కలసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించేలా పోరాటం చేయాలన్న వాదన బీజేపీ సానుభూతిపరుల్లో వినిపిస్తోంది.