జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారా ? ఎప్పుడు ? ఎక్కడ ?

కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించిందని పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ అయింది. అయితే అసలు సందర్భం లేకుండా ఇప్పుడు ఎందుకు కేటాయిస్తారని చాలా మంది అనుమానం వచ్చింది. ఆ ఉత్తర్వులు ఉంటే వెల్లడించాలని డిమాండ్స్ వినిపించాయి. కానీ జనసేన వైపు నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఈసీ వెబ్ సైట్ లోనూ అలాంటి ఉత్తర్వులేమీ లేవు. దీంతో పవన్ కల్యాణ్ కు తప్పుడు సమాచారం వచ్చిందని బావిస్తున్నారు.

గుర్తింపు కోసం అవసరమైన ఓట్లు, సీట్లుతెచ్చుకోని జనసేన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. గాజు గ్లాసంటే.. అందరికీ గుర్తొచ్చేది జనసేన పార్టీనే. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఈ గుర్తుతోనే బరిలో నిలిచింది. ఆ గుర్తుతోనే గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలోనే ఉన్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు, కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు అయినా దక్కించుకోవాలి. అయితే గత ఎన్నికల్లో జనసేనకు.. 5.9 శాతం ఓట్లు వచ్చాయి.. ఒకే అసెంబ్లీ స్థానం గెలిచారు. అందుకే గుర్తింపు పొందలేకపోయారు.ఈ కారణంగా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ లో చేర్చారు.

పొతులతో అసలు సమస్య

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జనసేన పోటీ చేయకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లోనూ జనసేన పొత్తులతో పోటీ చేయనుండటంతో గాజు గ్లాస్ గుర్తు కీలకం అయింది. జనసేన పోటీ లేని చోట్ల గాజు గ్లాస్ ఉంటే సమస్య అవుతుంది. ఇండిపెండెంట్లు ఎవరైనా తమకు గాజు గ్లాస్ గుర్తు కావాలని అడిగే అవకాశం ఉంది. అదే జరిగితే పొత్తులకు అర్థం ఉండదు. ఇప్పుడు త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీ గుర్తు విషయంలో జనసేన నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. స్పందన మాత్ర స్పష్టత లేదు . కానీ ఎన్నికల సమయంలో మాత్రమే నిర్ణయం తీసుకుంటారు.

గాజు గ్లాస్ దక్కుతుందని జనసేన నమ్మకం

గాజు గ్లాస్ ప్రస్తుతం ఫ్రీ సింబల్స్ లో ఉంది. జనసేనకు వేరే గుర్తు లభిస్తే..దానిని జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఈ ఆరు నెలల సమయం సరిపోదు. గ్లాసు గుర్తు విషయంలో వారాహి యాత్ర ప్రారంభం సందర్భంగా పవన్ కు పేర్ని నాని కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గుడి దగ్గర చెప్పులు పోతే ఎవరో ఒక నిర్మాత కొనిస్తారని, కానీ ఆయన పార్టీకి ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు కూడా పోయిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తు ఎక్కడుందో వెతుక్కోవాలని, అది పోయి చాలాకాలమైందని నాని సెటైర్లు వేశారు. ఇప్పుడు గాజు గ్లాస్ తమదేనని పవన్ అంటున్నారు. అందులో నిజమేంటో తేలాల్సి ఉంది.