విఘ్నాధిపతిగా పూజలందుకునే వినాయకుడి నమస్కరించనిదే ఏ పనీ ప్రారంభించం. ఊరూరా గణపయ్యకు ఆలయాలున్నాయి…వాటిలో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలందుకున్నాడు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో కొలువైన శ్రీలక్ష్మీగణపతి. ఇక్కడ స్వామివారి చెవిలో ధర్మబద్ధమైన కోర్కెలు చెబితే తీరిపోతాయంటారు.
బిక్కవోలు గ్రామంలో కొలువైన శ్రీలక్ష్మీగణపతి దాదాపు 1100 సంవత్సరాల క్రితం కొలువయ్యాడని స్థలపురాణం. పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చెబితే..అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పి ఆ విగ్రహాన్ని తవ్వించి ప్రతిష్టించారని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెద్దదయిందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది
వినాయకుడి చెవిలో మాట్లాడాలి
ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకుని ముడుపు కడితే ఎంత పెద్ద కోర్కె అయినా తీరుతుందని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కూడా కొలువై ఉన్నారు. ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమణ్వేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. నిత్య పూజలు, పారాయణలు, దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు. పచ్చని పంట పొలాల్లో కొలువైన శ్రీ బిక్కవోలు గణపతి స్వామిని దర్శించిన స్వామివారి కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న స్వామి వారి ఆశీస్సులు ఉంటాయంటారు పండితులు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.