దేశం మారొచ్చు. దేశ ప్రజల ఆలోచనా విధానం మారొచ్చు. జీవన స్థితిగతులు మారొచ్చు. దేశం పేరు మార్పు మాత్రం అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే అది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇప్పుడు కూడా ఇండియా పేరు మార్పుకు సంబంధించిన అంశంలో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండియా దటీస్ భారత్ అని రాజ్యాంగంలో అంబేద్కర్ మహాశయుడు రాసినప్పటికీ విపక్షాలు మాత్రం భారత్ పేరును అంగీకరించేందుకు ఇష్టపడుతున్నట్లుగా కనిపించడం లేదు..
వ్యతిరేకిస్తున్న విపక్షాలు
ఇండియా పేరును పూర్తిగా తొలగించి భారత్ అని పెట్టే ప్రయత్నాన్ని విపక్ష ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది. ఇదీ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని కూటమి నేతలు వాదిస్తున్నారు. జీ-20 డిన్నర్ ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించినప్పటి నుంచి ఇండియా కూటమి దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. దేశం పేరు మార్చుతూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని ఇండియా కూటమి ఆరోపించగా..దాన్ని బీజేపీ ఖండించకపోవడం, అందులో తప్పేముందని కొందరు బీజేపీ నేతలు ఎదురు ప్రశ్న వేయడంతో ఇండియా కూటమి అనుమానాలు మరింతగా పెరిగాయి. పేరు మార్పుకు వ్యతిరేకంగా అక్కడక్కడ తీర్మానాలు కూడా చేస్తున్నారు.
భారత్ అని పిలవాలన్న భగవత్
ఆరెస్సెస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటన అసలు వ్యవహారం మొత్తానికి కారణమవుతోంది. ఇకపై దేశాన్ని భారత్ అని పిలవడం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. వెస్ట్ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ దిలీప్ ఘోష్.. రెండు ఆకులు ఎక్కువే తిన్నట్లున్నారు. ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు ఇష్టపడని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని అన్నారు. ఒక బీజేపీ నాయకుడైతే ఇండియా అనేది బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన బూతు పదమని ఆరోపించారు. పైగా దేశంలో ఉన్న విదేశీయుుల విగ్రహాలన్నింటినీ తొలగించాలని కొందరు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు…
మొత్తం మార్చేస్తారని ఇండియా కూటమి భయమా..
పేరుకు ఇండియా కూటమే అయినా ఎక్కువ మాట్లాడుతున్నది మాత్రం కాంగ్రెస్ వాళ్లే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వారిలో పళణియప్పన్ చిదంబరం, జైరాం రమేష్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ.. కేంద్ర నిర్ణయాలపై దుమ్మెత్తి పోసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగం మొదటి అధికరణంలోనే ఇండియా దటీజ్ భారత్ షల్ బీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉందని తెలిసినప్పటికీ భారత్ పేరును అంగీకరించేందుకు కూటమి ఇష్టపడటం లేదు. అదేమంటే బీజేపీకి రాజ్యసభలో బలం లేదని, ఐనా తన నిర్ణయాలను జనంపైకి రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ భయమంతా ఒక్కటే. ఇప్పుటికే ప్రణాళికా సంఘం పేరును నీతి ఆయోగ్ గానూ, నెహ్రూ సెంటర్ పేరును మరోకటిగానూ మార్చేశారని, దేశం పేరును భారత్ గా మార్చి ఇండియా అన్న మాటను లేకుండా చేస్తే బీజేపీ తీరు పరాకాష్టకు చేరుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పడిక అన్నింటినీ మార్చి, దేశంలో కాంగ్రెస్ మార్కు లేకుండా చేసేందుకు ఎక్కువ టైమ్ పట్టదన్నది వారి భయం. అన్ని రంగాల్లోనూ బీజేపీ ఆక్యుపై చేస్తే తమకు పుట్టగతులుండవని కూడా కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. అంతే అంతకన్నా వేరే ఏమీ లేదు….